శంకర్ దక్షిణ చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు. ఎంత భారీ సినిమా తీసినా, నేల విడిచిసాము చేయని వాడు. దాదాపు ప్రతి సినిమాలోనూ అండర్ కరెంట్ గా ఓ మెసేజ్ వుండేలా చూసేవాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలే కాదు, నిర్మించిన సినిమాలు కూడా మంచి కథా బలం వున్న సినిమాలే.
అయితే శంకర్ సినిమాలకు మూల కథలు చాలా వరకు ఆయనవి కావు. స్క్రీన్ ప్లేలు మాత్రమే ఆయన తయారుచేసుకుంటారు. ఆరంభంలో బాలకుమురన్ అనే సుప్రసిద్ధ తమిళ రచయిత శంకర్ సినిమాలకు కథలు అందించారు. జంటిల్ మన్, ప్రేమికుడు, జీన్స్ కథలు ఆయనవే.
ఈ బాలకుమురన్ ఇంకా చాలా తమిళ హిట్ సినిమాలకు రచయిత. గుణ, భాషా, మన్మధ సినిమాల కథలు కూడా ఆయనవే. ఆ తరువాత సుజాత రంగరాజన్ తన కథలను శంకర్ సినిమాలకు ఇచ్చారు. ఒకే ఒక్కడు, భారతీయడు, రోబో వంటి సినిమాల కథలు సుజాతవే. ఆయన ఇప్పుడు లేరు.
ఐ సినిమాకు శంకర్ కు శుభ అనే రచయిత సహకరించారు. ఆయన కూడా చిన్నవాడేమీ కాదు. తమిళనాట చాలా సినిమాలకు, టీవీ సీరియళ్లకు పనిచేసినవాడు. సూర్య నటించిన ఆరు, తెలుగులో కూడా పెద్ద హిట్ అయిన రంగం తదితర 10 సినిమాలకు ఆయన పనిచేసారు. అయితే బాలకుమరన్, సుజాత మాదిరిగా భారీ ప్రాజెక్టులకు, విస్తృతి గల కథలు అందించిన అనుభవం ఆయనకు తక్కువ.
కేవలం వైరస్ ఎక్కించి కురూపిగా మార్చడం, పగతీర్చుకోవడం అన్న చిన్న పాయింట్ ఆధారంగా ఐ సినిమా రూపొందించాలని డిసైడ్ అయిపోయారు. కానీ అది వందకోట్లకు పైగా బడ్జెట్ తో తయారయ్యే సినిమాకు సరిపడే విధంగా విస్తృతి పెంచడంలో విఫలమయ్యారు. మంచి స్క్రీన్ ప్లే రచయిత అయిన శంకర్ తన తొలి సినిమా జంటిల్ మన్ లో వాడిన తరహా స్క్రీన్ ప్లే నే ఇంచుమించుగా వాడారు.
అయితే తన సబ్జెక్ట్ లు ఎంత అప్ డేట్ అయినా కామన్ మాన్ కు అర్ధమయ్యేలా చెప్పడంలో జాగ్రత్త వహించే శంకర్ ఈ సినిమాలో మాత్రం ఆ పని చేయలేకపోయారు. దాంతో సినిమాలో అనసరమైన సీన్లు ఎక్కువ సాగి, అవసరమైన సీన్లు చకచకా నడిచిపోయినట్లయింది.