హిందూ మహాసభ కొత్త డిమాండ్ వినిపించింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన ఉనికిని చాటుకొంటున్న ఈ హిందూ ధార్మిక సంస్థ ఇప్పుడు తన హిందూయిజంలో కొత్త అధ్యాయానికి రూపకల్పన చేసింది. ఈ సారి ఈ సంస్థ సెలబ్రిటీ ముస్లింలను లక్ష్యంగా చేసుకొంది. వారు మతం మార్చుకోవాలని డిమాండ్ చేసింది!
ఈ జాబితాలో బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్ , సైఫ్ అలీ ఖాన్ లుండటం విశేషం వీరు హిందూయిజాన్ని స్వీకరించి.. ఈ ధర్మాన్ని అనుసరించాలని హిందూ మహాసభ డిమాండ్ చేసింది. ఎందుకలా అంటే.. ఈ ముగ్గురు హీరోలూ హిందూ అమ్మాయిలను వివాహం చేసుకొన్నారు. నిజంగానే ఈ హీరోలకు వారి భార్యలపై ప్రేమ ఉంటే… హిందూమతాన్ని పుచ్చుకోవాలని హిందూ మహా సభ డిమాండ్ చేసింది!
ఈ విధంగా ప్రముఖ బాలీవుడ్ హీరోల ప్రేమకు పరీక్ష పెట్టింది హిందూ మహా సభ. షారూక్ ఖాన్ గౌరీని, ఆమిర్ కిరణ్ రావ్ ని, సైఫ్ కరీనాను వివాహం చేసుకొన్నారు. ఈ ముగ్గురు హీరోల భార్యలూ కూడా హిందువులుగానే ఉన్నారు. తమ భర్తలు ముస్లింలే అయినా.. తాము ఇస్లాంలు స్వీకరించలేదని గౌరి, కిరణ్ , కరీనాలు వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ మహా సభ తనదైన శైలిలోఈ డిమాండ్ ను వినిపించింది.
హిందూ అమ్మాయిలను ప్రేమించి.. వారు లేకపోతే బతకలేమన్న దశలో వారిని వివాహం చేసుకొన్న ఈ హీరోలు హిందూ యిజాన్ని అనుసరించాలని.. తద్వారా భార్యలపై ప్రేమను నిరూపించుకోవడంతో పాటు హిందూ సంస్కృతికి విలువనివ్వాలని ఈ ధార్మిక సంస్థ డిమాండ్ చేస్తోంది. ఇది వరకూ లవ్ జిహాద్ జరుగుతోందని.. ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకొని వారిని జిహాదీలుగా మార్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన హిందూ మహాసభ ఇఅదే అంశాన్ని ఈ విధంగా ఇప్పుడు ఇలా వార్తల్లోకి తీసుకొస్తోంది.
మరి ఈ పిలుపుపట్ల షారూక్ , సైఫ్ , ఆమిర్ లు ఎలా స్పందిస్తారో.. వారి భార్యలు ఎలా రియాక్ట్ అవుతారో!