ప్లీజ్.. ఐటెంసాంగ్స్ అయినా ఇవ్వండి

క్రేజ్ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం కూడా ఓ కళ. అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం అందరి వల్ల కాదు. ప్లానింగ్ లోపం వల్ల ఇండస్ట్రీకి దూరమైన భామలు ఎంతోమంది. ఇప్పుడు శృతిహాసన్ కూడా అదే ప్లానింగ్…

క్రేజ్ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం కూడా ఓ కళ. అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం అందరి వల్ల కాదు. ప్లానింగ్ లోపం వల్ల ఇండస్ట్రీకి దూరమైన భామలు ఎంతోమంది. ఇప్పుడు శృతిహాసన్ కూడా అదే ప్లానింగ్ లోపంతో బాధపడుతోంది. క్రేజీ హీరోయిన్ కాస్తా ఇప్పుడు ఐటెంసాంగ్స్ కు కూడా రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తోంది. 

శ్రీమంతుడు తర్వాత తెలుగులో ఆమెకు అమాంతం క్రేజ్ వచ్చింది. ఎన్నో బడా ఆఫర్లు తలుపుతట్టాయి. కానీ బాలీవుడ్ డ్రీమ్స్ కారణంగా చాలా ఆఫర్లను పక్కనపెట్టేసింది శృతిహాసన్. అలా లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ సరసన కాటమరాయుడు సినిమా చేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాతైనా శృతిహాసన్ వరుసగా తెలుగులో సినిమాలు చేసుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. 

ప్రస్తుతం తెలుగులో ఆమె కోసం ఎవరూ ఎదురుచూడ్డం లేదు. రకుల్, సమంత, రాశిఖన్నాలాంటి ముద్దుగుమ్మలతో పాటు.. పూజా హెగ్డే, కైరా అద్వానీ లాంటి భామలు దూసుకొచ్చారు. దీంతో భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి శృతిహాసన్ ను తీసుకోవాలనే ఆలోచన ఎవరికీ రావడం లేదు. 

మరోవైపు శృతిహాసన్ సడెన్ గా ఖాళీ అయిపోయింది. ఓ చిన్న బాలీవుడ్ మూవీ తప్ప ఆమె చేతిలో మరో సినిమా లేదు. అది కూడా ఇంకా సెట్స్ పైకి రాలేదు. నిజానికి సౌత్ లో సినిమాలు చేయాలని శృతిహాసన్ కు లేదు. కానీ ఇప్పుడామె చాలా ఖాళీ అయిపోయింది. చేయాలనుకున్న మ్యూజిక్ ఆల్బమ్స్ పని కూడా ఇంకా మొదలుకాలేదు.

అందుకే ఈ గ్యాప్ లో కొన్ని బడా సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేయడానికి ఆమె రెడీ అవుతోంది. శృతిహాసన్ కు స్పెషల్ సాంగ్స్ కొత్త కాదు. గతంలో ఆగడు సినిమాలో ఐటెంసాంగ్ చేసింది.