కొత్తరకం కథతో వచ్చినట్టుగానే కనిపిస్తోంది కానీ.. ఈ సినిమా ట్రైలర్ ను ఒక యాంగిల్ నుంచి చూస్తే మొన్నామధ్య వచ్చిన సినిమా కథే గుర్తుకు వస్తుండటం గమనార్హం. ఇది ‘రాజా ది గ్రేట్’ గురించి. రవితేజ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దిల్ రాజు నిర్మాణంలో మొహ్రీన్ నాయికగా రూపొందింది. ఈ వారంలోనే విడుదల కూడా.
ఈ సినిమా ట్రైలర్ ను పదే పదే చూడగా గుర్తుకు వచ్చే సినిమా ‘ఒప్పం’. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఆ సినిమా ఒక థ్రిల్లర్. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఆ సినిమా ‘కనుపాప’ పేరుతో తెలుగులో విడుదల అయ్యింది. అయితే అంతగా ఆకట్టుకోలేకపోయింది. స్వయంగా మోహన్ లాలే ఆ సినిమాను తెలుగులోకి అనువదించి విడుదల చేశాడు.
అంతకు ముందే మనమంతా, జనతా గ్యారేజ్, మన్యంపులి వంటి సినిమాలతో లాల్ తెలుగు ప్రేక్షకులను పలకరించడంతో.. కనుపాప కూడా తెలుగులోకి అనువాదం అయ్యింది. కానీ.. పై మూడు సినిమాలతో పోలిస్తే కనుపాపను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. అదొక చక్కటి థ్రిల్లర్. హీరో అంధుడు.. అపార్ట్ మెంట్ లో పని చేస్తూ ఉంటాడు. అసలు అతడు గుడ్డివాడు అంటే నమ్మడం కష్టం. అపార్ట్ మెంట్ లోని ఒక జడ్జికి హీరో సన్నిహితుడిగా మెలుగుతూ ఉంటాడు.
ఉన్నట్టుండి ఆ జడ్జి హత్య జరుగుతుంది. అతడి ఇంట్లోని డబ్బు పోతుంది. ఆ హత్యను హీరోనే చేశాడనే అభియోగం వస్తుంది. కానీ ఆ జడ్జి హీరోకి అప్పటికే తనను ఒకడు హత్య చేసే అవకాశం ఉందని చెప్పి ఉంటాడు. తన కెరీర్ లో ఒక పొరపాటు తీర్పు ఇచ్చానని.. ఆ తీర్పు వల్ల ఒక వ్యక్తి యావజ్జీవ శిక్షను అనుభవించాడని, అది తట్టుకోలేక అతడి కుటుంబీకులంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఇప్పుడు ఆ వ్యక్తి జైలు నుంచి విడుదల అయ్యాడని.. తన వాళ్లను వెంటాడుతూ చంపుతున్నాడని, తన సంరక్షణలోని ఒక చిన్న పాపను కూడా అతడు చంపాలని చూస్తున్నాడని.. కాపాడమని ఆ రిటైర్డ్ జడ్జి హీరోని అడిగి ఉంటాడు.
ఇలాంటి నేపథ్యంలో తనపై వచ్చిన హత్యారోపణల నుంచి అంధుడు అయిన హీరో ఎలా బయటపడ్డాడు, ఆ చిన్నపాపను ఎలా కాపాడుకున్నాడు అనేది ఆ సినిమా స్టోరీ. ఇక రాజాది గ్రేట్ ట్రైలర్ ను బట్టి చూస్తే.. అంధుడు అయిన హీరో ఆపదలోని హీరోయిన్ ను కాపాడే బాధ్యతను తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. అక్కడ చిన్నపాప, ఇక్క పెద్ద పాప.. ఇంతేనా తేడా, లేక ఇంకా ఉన్నాయా.. లెట్ వెయిట్ అండ్ సీ!