రానా ఇంకా బాక్సాఫీసు దగ్గర సత్తా చూపలేదు. `లీడర్`, `కృష్ణమ్ వందే జగద్గురుమ్` చిత్రాలు క్రిటిక్స్ వరకే పరిమితమయ్యాయి. కమర్షియల్‌గా ఓ భారీ హిట్టు సొంతం చేసుకొంటేనే ఆయనకి మాస్‌లో ఫాలోయింగ్ పెరుగుతుంది. ఆ విషయాన్ని తెలుసుకొనే రానా రెండు మూడు బలమైన కథల్ని ఎంపిక చేసుకొన్నాడు.
సెల్వ రాఘవన్, హను రాఘవపూడి లాంటి దర్శకుల చిత్రాల్లో నటించడానికి సిద్ధమైపోయాడు. కానీ ఇంతలోనే ఆయనకి `బాహుబలి`, `రుద్రమదేవి`లాంటి భారీ ఆఫర్లొచ్చాయి. దీంతో అప్పటిదాకా చేయాలనుకొన్న ఆ సినిమాల్ని పక్కనపెట్టి బాహుబలి, రుద్రమదేవి సెట్స్‌కి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ చిత్రాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అందుకే మళ్లీ తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇటీవల ఆయనకి `సోలో` ఫేమ్ పరశురామ్ ఓ కథ వినిపించాడట. అది బాగా నచ్చిందట. దీంతో ఆ సినిమానే ముందు సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకొన్నాడట. పరశురామ్‌కి ఇటీవల సరైన విజయాల్లేవు. కానీ… ఆయన చెప్పిన కథపై నమ్మకంతో రానా నటించేందుకు సిద్ధమయ్యాడట. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపైనే తెరకెక్కబోతున్నట్టు తెలిసింది.