ఇప్పుడు కాదు కానీ.. ఒక దశలో బోనీకపూర్ ఆర్థిక పరిస్థితిపై బాలీవుడ్ మీడియాలో బోలెడన్ని కథనాలు వచ్చాయి. బాలీవుడ్ లో బోనీకపూర్ ఒకప్పుడు బడా ప్రొడ్యూసర్. ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో నటించింది శ్రీదేవి. తమ్ముడు అనిల్ కపూర్ ను హీరోగా పెట్టి సినిమాలూ తీస్తూ వస్తున్న బోనీ.. వాటిల్లో తమ్ముడి సరసన నటించిన శ్రీదేవిని వివాహం చేసుకొన్నాడు. అప్పటికే బోనీ పెళ్లైన వ్యక్తి. పిల్లలున్న వ్యక్తి.
అలాంటి వ్యక్తిని శ్రీదేవి పెళ్లి చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఒకవైపు దేశమంతా శ్రీదేవిని ప్రేమిస్తే.. శ్రీదేవి మాత్రం రెండో పెళ్లి వాడిని ప్రేమించిందనే వ్యాఖ్యానాలు గట్టిగా వినిపించాయి. దీనికి తోడు.. అందం, ఆకారం విషయంలో కూడా బోనీకపూర్ కు పడే మార్కులు తక్కువ కావడంతో సామాన్య జనం ముక్కున వేలేసుకున్నారు. శ్రీదేవి మొగుడు అంటే.. అతడు ఆమె అందగాడు అయి ఉంటాడనే ఆలోచన జనాల్లో ఉండటం పెద్ద వింతకాదు.
అందుకు భిన్నమైన పరిస్థితి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అలాంటి మాటలను శ్రీదేవి లైట్ తీసుకుంది. అంతకు మించి శ్రీదేవి కుటుంబాన్ని వార్తల్లో నిలిపిన అంశం.. ఆర్థిక కష్టాలు. బోనీ తీసిన సినిమాలు వరసగా బోల్తా పడటంతో.. అతడు దివాళా దశకు వచ్చాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ అంశంపై డైరెక్టుగా శ్రీదేవినే మీడియా ఆరా తీసింది. ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడ్డాకా ఈ అంశంపై శ్రీదేవి వివరణ ఇచ్చింది.
అప్పట్లో బోనీకపూర్ ఒక బూతు సినిమాను రూపొందించాడు. అదే ‘నో ఎంట్రీ’ 2005లో వచ్చిన ఈ సినిమా తెలుగు వారికి పరిచయం ఉన్నదే. ఎస్వీకే దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళాం ఊరెళ్తే’ సినిమా కథతో రూపొందిందే నో ఎంట్రీ. వీటికి మూలం ఒక తమిళ సినిమా. తెలుగు, తమిళ వెర్షన్లు చాలా క్లీన్ గా ఉండగా.. హిందీలో దీన్ని బూతు కామెడీగా వండాడు అనీస్ బజ్మీ. ఆ బూతులు జనాలకు ఎక్కాయి.
24కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఏకంగా 74కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో బోనీ సర్ ప్లస్ అయ్యాడు. అప్పుడు శ్రీదేవి స్పందించింది. ‘మా ఆయన రూపొందించిన తాజా సినిమా బాగా ఆడుతోంది. డబ్బులు వచ్చాయి. ఒక్క సినిమాతో బోల్తాపడ్డ బడా నిర్మాతలను నేనెంతో మందిని చూశాను. అయితే అన్ని ఫ్లాఫ్స్ వచ్చినా తట్టుకుని నిలబడ్డ నా భర్త గొప్పవాడు కాదా..’ అని శ్రీదేవి భర్తను సమర్థించింది.
నో ఎంట్రీ తర్వాత బోనీ కపూర్ మరో సౌత్ రీమేక్ నే ఎంచుకున్నాడు. అదే ‘పోకిరి’ రీమేక్ ‘వాంటెడ్’. ఈ సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ గా పేరు తెచ్చుకుంది. భారీ లాభాలు కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ ‘తేవర్’ సినిమాను చేశాడు బోనీ. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఒక్కడు’కు రీమేక్ ఇది. ప్రశంసలు రాలేదు కానీ.. పెట్టిన పెట్టుబడి అయితే రాబట్టింది.
బోనీ రూపొందించిన చివరి సినిమా ‘మామ్’. ఇందులో శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించింది. కమర్షియల్ గా మరీ సూపర్ హిట్ కాలేదు. ఏతావాతా గత పదిపన్నెండేళ్లుగా బోనీ తీసింది ఐదారు సినిమాలే. వీటిల్లో డబ్బులు పోగొట్టిన సినిమాలు ఏవీలేవు. అంతో ఇంతో తెచ్చిపెట్టినవే ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సినీ వ్యాపారంలో శ్రీదేవి కుటుంబం పోగొట్టుకున్నది ఏమీలేదు. ఈ ట్రాక్ ను బట్టి చూస్తే మిస్టరీగా మారిన శ్రీదేవి మరణానికి ఆర్థిక పరమైన కారణాలు లేవనే అనుకోవాలి.