బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పల పెడుతోంది జియో. ఇప్పటికే అతితక్కువ రీచార్జీలతో అత్యధిక ప్రయోజనాలు అందిస్తున్న జియో.. తాజాగా మరో ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు రీచార్జీలతోనే క్యాష్ బ్యాక్ అందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు మొబైల్ కొనుగోళ్లకు కూడా ఈ ఆఫర్లు వర్తింపజేసింది.
ఇందులో భాగంగా 22 మొబైల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది జియో. ఒప్పందం ప్రకారం.. వినియోగదారు ఎవరైనా సదరు 22 కంపెనీలకు చెందిన ఏ మొబైల్ కొనుక్కున్నప్పటికీ.. అందులో జియో సిమ్ వేసుకుంటే 2200 రూపాయల్ని క్యాష్ బ్యాక్ గా అందిస్తోంది. ఇవి 44 క్యాష్ బ్యాక్ ఓచర్ల రూపంలో మైజియో యాప్ లోకి చేరుతాయి. రీచార్జ్ చేయించుకున్న ప్రతిసారి క్యాష్ బ్యాక్ వచ్చేలా ఈ ప్లాన్ రూపొందించారు.
ఈ ఆఫర్ లో రెండు మెలికలు పెట్టింది జియో. ఒకటి మార్చి 31లోపు మాత్రమే మొబైల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది రూ.198 లేదా రూ.299 రీచార్జ్ పై మాత్రమే క్యాష్ బ్యాక్ ఆఫర్ పెట్టింది. కానీ ఎలా చూసుకున్నా ఈ ఆఫర్ లాభసాటిదే. ఉదాహరణకు మీరు 299 రీచార్జే చేయించుకోవాలనుకుంటే.. మీరు రీచార్జ్ చేసుకున్న ప్రతిసారి 50రూపాయలు తగ్గుతుందన్నమాట. అలా 44 సార్లు మీరు రీచార్జ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఆఫర్ కు సంబంధించి శాంసంగ్, షియామీ, నోకియా, మోటారోలా, బ్లాక్ బెర్రీ, ఆసెస్, పానసోనిక్, ఎల్జీ లాంటి 22 మొబైల్ కంపెనీలతో జియో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న డేటా ఆఫర్లు యథాతథంగా ఉంటాయని కూడా ప్రకటించింది.