శ్రీదేవి భౌతిక కాయం అప్పగింత

సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నో కోణాల్లో విచారణ అనంతరం ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె భర్త బోనీకపూర్ కు అప్పగించారు దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు. బోనీతో పాటు దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులకు క్లియరెన్స్…

సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నో కోణాల్లో విచారణ అనంతరం ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె భర్త బోనీకపూర్ కు అప్పగించారు దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు. బోనీతో పాటు దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులకు క్లియరెన్స్ లెటర్ అందించారు. దీంతో మరికొన్ని గంటల్లో ఆమె పార్థిక దేహం ముంబయికి రానుంది. ఆమె భౌతికకాయాన్ని తీసుకొచ్చేందుకు ఆదివారం సాయంత్రం నుంచే దుబాయ్ లో రిలయన్స్ కు చెందిన విమానం సిద్ధంగా ఉంది.

ఈ కేసుకు సంబంధించి శ్రీదేవి భర్త బోనీకపూర్ ను ప్రాసిక్యూషన్ సుదీర్ఘంగా విచారించింది. దాదాపు 17గంటల పాటు వివిధ కోణాల్లో ప్రశ్నలు వేసింది. పోస్ట్ మార్టం నివేదికలో అనుమానాలు రావడంతోనే ఈ కేసును తన చేతిలోకి తీసుకున్న ప్రాసిక్యూషన్ బోనీతో పాటు శ్రీదేవి కారు డ్రైవర్, హోటల్ సిబ్బందిని ప్రశ్నించింది.

మరోవైపు తండ్రికి సహాయంగా దుబాయ్ వెళ్లాడు హీరో అర్జున్ కపూర్. అతడు దుబాయ్ లో ల్యాండ్ అయిన కొన్ని గంటలకే భౌతిక కాయాన్ని అప్పగిస్తూ, క్లియరెన్స్ లెటర్ జారీచేసింది ప్రాసిక్యూషన్. దీంతో శ్రీదేవి భౌతికకాయం భారత్ కు రావడానికి మార్గం సుగమమైంది.

మరోవైపు కుటుంబ కలహాలు కూడా శ్రీదేవి మరణానికి కారణం అయి ఉండొచ్చంటూ వార్తలు వస్తున్నాయి. దుబాయ్ లో జరిగిన పెళ్లిలో శ్రీదేవికి తగిన ప్రాధాన్యం దక్కలేదని (బోనీకపూర్ కు రెండో భార్య కాబట్టి) చాలామంది చెప్పుకొస్తున్నారు. మొదటి భార్యకు, ఆమె సంతానానికి దగ్గరగా ఉండే బోనీకపూర్ తరఫు బంధువులు.. శ్రీదేవిని చిన్నచూపు చూశారని, అందువల్లే ఆమె హోటల్ గది నుంచి 2రోజుల పాటు బయటకు రాలేదని వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాలతో పాటు బోనీ కపూర్ ఆర్థిక లావాదేవీలపై దుబాయ్ ప్రాసిక్యూషన్ విచారణ జరిపింది. శ్రీదేవి, బోనీ కపూర్ కాల్ డేటాను కూడా విశ్లేషించింది. దాదాపు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ పూర్తయిన తర్వాతే శ్రీదేవి భౌతిక కాయాన్ని అప్పగించారు. త్వరలోనే తమ పూర్తి నివేదికను భారత ప్రభుత్వానికి అప్పగిస్తారు.