శ్రీదేవి.. సౌత్‌, నార్త్‌ సినిమాలకు వారధి!

ఇప్పుడు ఆమె మరణించిందని కాదు.. ఇంతకు ముందు నుంచినే చాలామంది దక్షిణాది సినీ ప్రముఖులు తమ ప్రస్థానం గురించి చెబుతూ.. ఆమె ప్రస్తావన చేసేవాళ్లు. ప్రత్యేకించి ఇక్కడ సూపర్‌ హిట్స్‌ను కొట్టిన ప్రముఖ దర్శకులు..…

ఇప్పుడు ఆమె మరణించిందని కాదు.. ఇంతకు ముందు నుంచినే చాలామంది దక్షిణాది సినీ ప్రముఖులు తమ ప్రస్థానం గురించి చెబుతూ.. ఆమె ప్రస్తావన చేసేవాళ్లు. ప్రత్యేకించి ఇక్కడ సూపర్‌ హిట్స్‌ను కొట్టిన ప్రముఖ దర్శకులు.. హిందీలో ఎందుకు సినిమాలు చేయడం, చేయకపోవడం.. అనేఅంశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీదేవి ప్రస్తావన తీసుకురావడం జరుగుతూ వచ్చేది. ఈ విషయం గురించినే సీనియర్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి ఒకసారి చెప్పారు.

తెలుగులో వందకు దగ్గరదగ్గరగా సినిమాలు చేసిన కోదండరామిరెడ్డి బాలీవుడ్‌లో మాత్రం పెద్దగా సినిమాలు చేయలేదు. తెలుగు లెజెండరీ దర్శకులంతా తెలుగుతో పాటు.. హిందీలో కూడా పలు సినిమాలు చేశారు. కే విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు వంటి వాళ్లు బాలీవుడ్‌లో కూడా పలు సినిమాలను చేశారు. అయితే కోదండరామిరెడ్డి మాత్రం హిందీలో ఒకటీ రెండు సినిమాలు చేశారు.

ఈ అంశం గురించినే ఆయన మాట్లాడుతూ… తనకు బాలీవుడ్‌ ఆఫర్లు చాలానే వచ్చాయని, అయితే తెలుగులో అప్పట్లో చాలా బిజీగా ఉండిపోవడంతో చేయలేకపోయానని చెప్పిన కోదండరామిరెడ్డి ప్రత్యేకించి శ్రీదేవి ప్రస్తావన తీసుకొచ్చారు. తనను హిందీ సినిమాలు చేయమని శ్రీదేవి సూచించేదని చాలా సంవత్సరాల కిందటే చెప్పాడు కోదండరామిరెడ్డి. తెలుగులో తన సినిమాలేవైన హిట్‌ అయితే వాటిని చూసి.. హిందీలో రీమేక్‌ చేయమని శ్రీదేవి చెప్పేదని, నిర్మాతలకు చెప్పి తనకు ఫోన్లు చేయించేదని కోదండరామిరెడ్డి వివరించారు చాన్నాళ్ల కిందట. ఇవన్నీ శ్రీదేవి చనిపోయాకా చెప్పిన మాటలు కాదు.. ఆమె ఉన్న రోజుల్లోని మాటలే.

ఈ రకంగా చూస్తే.. దక్షిణాది, ఉత్తరాది సినిమాలకు వారధి శ్రీదేవి. శ్రీదేవి తెలుగు, తమిళ భాషల్లోనే ముందుగా స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. ఇక్కడ స్టార్‌ కాకముందే హిందీలో అడపాదడపా నటిస్తూ వచ్చింది. ఇక్కడ స్టార్‌ అయ్యాకా.. బాలీవుడ్‌లోనూ స్టార్‌ అయ్యిందీమె. ఇదే సమయంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. శ్రీదేవి హిందీలో నటించిన సినిమాల్లో చాలావరకూ దక్షిణాది రీమేక్‌ సినిమాలే ఉన్నాయి.

సౌత్‌లో సూపర్‌ హిట్‌ అయితే వివిధ సినిమాల హిందీ రీమేక్‌లలో శ్రీదేవి నటిస్తూ వచ్చింది. ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ సినిమా 'జూలీ' కూడా ఒక మలయాళం సినిమా రీమేకే. మలయాళంలో హిట్‌ అయిన ఒక సినిమానే హిందీలో 'జూలీ'గా రీమేక్‌ చేశారు. ఆ సినిమా అక్కడ సూపర్‌ హిట్‌ అయ్యింది. అలా శ్రీదేవి ప్రస్థానం అక్కడ మొదలైంది.

ఇక శ్రీదేవిని దక్షిణాది స్టార్‌గా మార్చిన సినిమా 'పదహారేళ్ల వయసు'. ముందుగా భారతిరాజా దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ క్లాసిక్‌ సినిమా అక్కడ శ్రీదేవిని ఓవర్‌నైట్‌ స్టార్‌గా చేసింది. ఆపై తెలుగులో రీమేక్‌ అయ్యి ఆ సినిమా అంతే సంచలన విజయం సాధించింది. విశేషం ఏమిటంటే.. ఇదే సినిమా రీమేక్‌తో ఫుల్‌లెంగ్త్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి.

ఆ వెంటనే వచ్చిన 'సద్మా' గురించి వేరే చెప్పనక్కర్లేదు. బాలూ మహేంద్ర రూపొందించిన 'వసంత కోకిల' సినిమాకు రీమేక్‌ ఇది. కమల్‌, శ్రీదేవిలతోనే మళ్లీ అక్కడ రీమేక్‌ చేశారు. ఆ వెంటనే వచ్చిన 'హిమ్మత్‌వాలా' కూడా ఒక తెలుగు సినిమాకు రీమేకే. సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన 'ఊరికి మొనగాడు' సినిమాకు రీమేక్‌గా హిమ్మత్‌ వాలా వచ్చింది. అక్కడా సూపర్‌ హిట్‌ అయ్యింది.

ఆ తర్వాతి సినిమా రీమేక్‌ కాదు కానీ.. ఒకేసారి దాన్ని తెలుగు, హిందీల్లో తీశారు. తెలుగులో 'అడవి సింహాలు' పేరుతో రూపొందిన ఆ సినిమాను హిందీలో 'జానీదోస్త్‌' పేరుతో తీశారు. ఇది తెలుగు, హిందీల్లో ఒకేసారి రూపొందింది. ఆపై 'మవాలీ' ఈ సినిమా కృష్ణ హీరోగా నటించిన 'చుట్టాలొస్తున్నారు జాగ్రత్త'కు రీమేక్‌. కే విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'సప్తపది' సినిమా హిందీ రీమేక్‌లో, సౌందరరాజన్‌ తమిళంలో రూపొందించిన ఒక సినిమా. హిందీ రీమేక్‌ 'కళాకార్‌'లో ఆపై నటించింది శ్రీదేవి. ఆ వెంటనే నటించిన బాలీవుడ్‌ సినిమా 'ఇంక్విలాబ్‌' కూడా సౌత్‌ సినిమా రీమేకే. కన్నడలో అంబరీష్‌ నటించిన 'చక్రవ్యూహ' సినిమాను అమిత్‌ రీమేక్‌ చేశాడు. అందులో శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది.

కృష్ణ, శోభన్‌ బాబుల మల్టీస్టారర్‌ 'ముందడుగు' హిందీ రీమేక్‌లో కూడా శ్రీదేవే హీరోయిన్‌. 'సర్దార్‌ పాపారాయుడు' హిందీ రీమేక్‌ 'సర్పరోష్‌', శోభన్‌బాబు సినిమా 'దేవత' రీమేక్‌ తోఫా,  టీ రాజేందర్‌ 'ప్రేమసాగరం' హిందీ రీమేక్‌, బొబ్బిలి బ్రహ్మన్న హిందీ రీమేక్‌ 'ధర్మాధికారి', చిరంజీవి సినిమా 'మగమహారాజు' హిందీ వెర్షన్‌, శోభన్‌ బాబు 'బలిదానం' హిందీ రీమేక్‌ 'బలిదాన్‌', 'త్రిశూలం' రీమేక్‌ 'నయా కదమ్‌', జస్టిస్‌ చౌదరి సినిమా హిందీ రీమేక్‌ 'జస్టిస్‌ చౌదరి', తమిళంలో భాగ్యరాజా రూపొందించిన 'వద్దంటే పెళ్లి' హిందీ రీమేక్‌ 'మాస్టర్జీ'… ఇవీ హిందీలో యంగ్‌ శ్రీదేవి నటించిన సినిమాలు. అన్నీ కూడా సౌత్‌ సినిమాల రీమేక్‌లే. వీటిల్లో సౌత్‌లో తనుచేసిన పాత్రలను హిందీలో కూడా తనే చేసింది శ్రీదేవి. కొన్ని మాత్రం వేరే హీరోయిన్లు చేసిన పాత్రలను హిందీలో శ్రీదేవి చేసింది.

ఇలా చెబుతూపోతే.. ఈ పరంపర చాలానే ఉంది. కృష్ణ సినిమా 'పచ్చనిసంసారం', తెలుగు పాత సినిమా 'మా బాబు', శోభన్‌బాబు సినిమా 'శ్రావణ సంధ్య', కమల్‌ హాసన్‌ సినిమా 'ఖాకీ సట్టై', జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్‌ 'చంద్రముఖి'… శ్రీదేవి హిందీలో నటించిన మెజారిటీ సినిమాలు దక్షిణాది సినిమాలకు రీమేక్‌లే. అలాగని శ్రీదేవికి డైరెక్ట్‌ హిందీ క్లాసిక్స్‌ లేవనికాదు. అద్భుతమైన డైరెక్ట్‌ హిందీ సినిమాల్లో నటించారు ఆమె. కానీ.. దక్షిణాది రీమేక్‌లే ఆమెకు హిందీలో చక్కటి కెరీర్‌ను ఇచ్చాయి. శ్రీదేవి పెళ్లి చేసుకుని.. నటనకు దూరం అవుతున్న దశలో వచ్చిన సినిమా 'జుడాయి'.

అరవై లక్షల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా దాదాపు మూడుకోట్ల రూపాయల వసూళ్లను సాధించింది ఆ రోజుల్లోనే. ఈ సినిమాకు మూలం తెలుగు సినిమా 'శుభలగ్నం'. తెలుగు మహిళా లోకాన్ని సెంటిమెంటల్‌గా పిండేసి బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా హిందీ రీమేక్‌ పట్ల శ్రీదేవే చొరవ చూపింది. తెలుగులో ఆమని చేసిన పాత్రలో జీవించేసింది శ్రీదేవి. తెలుగుకు మించిన స్థాయిలో కమర్షియల్‌గా హిట్‌ కావడమే కాకుండా, అక్కడ కూడా క్లాసిక్‌గా కూర్చుకుంది ఈ సినిమా.

ఈ విధంగా దక్షిణాది, ఉత్తరాది సినిమాల మధ్య వారధిగా నిలిచింది శ్రీదేవి. ఏదో అవకాశాలు వచ్చాయి, చేసింది.. అన్నట్టుగా లేదిక్కడ. దక్షిణాదిన ఏవైనా సినిమాలు హిట్‌ అయితే వాటి హిందీ రీమేక్‌ పట్ల ఆమెనే చొరవ చూపింది. ఫలానా సినిమా తెలుగులో బాగా ఆడింది, హిందీలో తీస్తే బాగా ఆడుతుంది… అనే ఆలోచనలతో నిర్మాతలకే సజెషన్లు చేసిన నటీమణి శ్రీదేవి. తమిళ, తెలుగు భాషలను చక్కగా మాట్లాడి, అర్థం చేసుకోగల సత్తా ఉన్న ఈ నటీమణి వాటిపట్ల తన జడ్జిమెంట్‌తో సినిమాలను రీమేక్‌ చేయిస్తూ, వాటిల్లో తను నటిస్తూ వచ్చింది.

నిర్మాతలకు హిట్‌ సబ్జెక్టులను అందించడమే కాకుండా, తను కూడా హిట్స్‌ను సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా వేషాలు చాలించుకున్నాకా.. భర్తకు కూడా ఇలాంటి సలహాలు ఇస్తూ వచ్చింది శ్రీదేవి. బోనీకపూర్‌ హిందీలో నిర్మించిన పలు సినిమాల్లో.. దక్షిణాది రీమేక్‌లే ప్రముఖంగా ఉన్న విషయాన్ని గమనించవచ్చు. తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన 'పోకిరి' హిందీ రీమేక్‌ బోనీకపూర్‌ బ్యానర్‌కు వెళ్లడానికి కారణం కూడా శ్రీదేవే. పూరీ జగన్నాథ్‌తో చర్చించుకుని ఆ సినిమా హిందీ రీమేక్‌ రైట్స్‌ను భర్త చేత కొనించింది శ్రీదేవి. ఫ్లాఫులతో విలవిల్లాడుతున్న బోనీకపూర్‌ బ్యానర్‌కు 'పోకిరి' రీమేక్‌ 'వాంటెడ్‌' కొత్త సత్తువను ఇచ్చింది.