శ్రీదేవిది జాగ్రత్తా.? అతి జాగ్రత్తా.?

అందాల నటి శ్రీదేవి, సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చేసింది చాలాకాలం గ్యాప్‌ తర్వాత 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' సినిమాతో. ఇకనేం, వరుసగా సినిమాలు చేసేస్తుందనుకుంటే, ఆ తర్వాత మళ్ళీ పెద్దగా సినిమాలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.…

అందాల నటి శ్రీదేవి, సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చేసింది చాలాకాలం గ్యాప్‌ తర్వాత 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' సినిమాతో. ఇకనేం, వరుసగా సినిమాలు చేసేస్తుందనుకుంటే, ఆ తర్వాత మళ్ళీ పెద్దగా సినిమాలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. శ్రీదేవి 'సై' అనాలేగానీ, బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌ కూడా ఆమెతో సినిమాలు చేయడానికి రెడీగా వున్నాయి. కానీ, శ్రీదేవి నుంచే 'గ్రీన్‌ సిగ్నల్‌' రావడంలేదు. 

ఇంకోపక్క, శ్రీదేవి కుమార్తె జాహ్నవిని హీరోయిన్‌గా పరిచయం చేసుందుకూ బోల్డన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామ్‌చరణ్‌ హీరోగా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకి సీక్వెల్‌ తీయనున్నారనీ, అందులో రామ్‌చరణ్‌ సరసన జాహ్నవి నటిస్తుందనీ అప్పట్లో గుసగుసలు విన్పించాయి. ఆ దిశగా శ్రీదేవితో సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే, ఆ ప్రాజెక్ట్‌ కూడా కార్యరూపం దాల్చలేదు. 

అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కోసం, మహేష్‌ కోసం హీరోయిన్‌గా జాహ్నవి పేరు పలుమార్లు తెరపైకొచ్చింది. అఖిల్‌ సినిమాకి తొలుత జాహ్నవి హీరోయిన్‌ అనే గుసగుసలు విన్పించాయి. బాలీవుడ్‌లో అయితే, చాలామంది హీరోలు జాహ్నవి కోసం ట్రై చేసి ఉస్సూరుమన్నారు. సినిమా హీరోయిన్‌ అన్పించేందుకు జాహ్నవిని గ్లామరస్‌గా బాలీవుడ్‌ ఫంక్షన్లలో పరిచయం చేసిన శ్రీదేవి, హీరోయిన్‌గా ఆమెను ప్రమోట్‌ చేసేందుకు మాత్రం ఎందుకు ఇంతగా ఆలోచిస్తోందో ఎవరికీ అర్థం కావట్లేదు. 

కథల ఎంపికలో ఎటూ తేల్చుకోలేకపోతోందట శ్రీదేవి. ఆ అతి జాగ్రత్తే జాహ్నవి కొంప ముంచుతోందని బాలీవుడ్‌ సినీ జనం అంటున్నారు. రెండు మూడేళ్ళ క్రితం నాటి జాహ్నవికీ ఇప్పటి జాహ్నవికీ చాలా తేడాలున్నాయనీ, ఇకపై జాహ్నవిని హీరోయిన్‌గా పరిచయం చేయాలని శ్రీదేవి ప్రయత్నించినా వర్కవుట్‌ అవ్వకపోవచ్చని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.