శ్రీమంతుడు సినిమా సాధించిన విజయం గురించి విన్నానని, గ్రామాల దత్తత అనే అంశం పై సినిమా తీయడం మంచి విషయమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.
చిత్ర నిర్మాత నవీన్ నిన్న విజయవాడలో చంద్రబాబును కలిసి, శ్రీమంతుడు సినిమాకు సంబంధించి, పది లక్షల రూపాయిల చెక్ ను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సినిమా చూడాల్సిందిగా కోరారు. ఆయన వీలు చూసుకుని, 15 తరువాత చూస్తానని అన్నారు.
ఈ సినిమా సాధించిన విజయం వల్ల, ప్రజల్లో గ్రామాల దత్తత గురించి మరింత అవగాహన ఏర్పడుతుందని, తాము చేపట్టిన గ్రామాల దత్తత పథకం పట్ల యువత మరింత మొగ్గుచూపే అవకాశం వుందని చంద్రబాబు అన్నారు. ఇదిలా వుంటే, నిర్మాత కేసిఆర్ ను కూడా కలిసి, సినిమా చూడాలని కోరే అవకాశం వుంది. ఇప్పటికే కేసిఆర్ తనయుడు కేటీఆర్ శ్రీమంతుడుపై పాజిటివ్ ట్వీట్ చేసారు.