శ్రీను వైట్లపై నిర్మాతల ఒత్తిడి

అంతన్నాడు.. ఇంతన్నాడు గంగరాజు.. తీరా చేస్తే, అక్కడ అంత సీన్ లేదని సరదా పాట వుంది. శ్రీనువైట్ల వ్యవహారం అలాంటిదే. ఈసారి స్క్రిప్ట్ చూడండి..చించేస్తున్నా. దంచేస్తున్నా. అసలు పూర్తి వెరైటీ. అంటూ తెగ చెప్పుకు…

అంతన్నాడు.. ఇంతన్నాడు గంగరాజు.. తీరా చేస్తే, అక్కడ అంత సీన్ లేదని సరదా పాట వుంది. శ్రీనువైట్ల వ్యవహారం అలాంటిదే. ఈసారి స్క్రిప్ట్ చూడండి..చించేస్తున్నా. దంచేస్తున్నా. అసలు పూర్తి వెరైటీ. అంటూ తెగ చెప్పుకు వచ్చారు. జనాలకు చెప్పడంవేరు. నిర్మాతలకు చెప్పడంవేరు. 15 కోట్లలో మెగా హీరోతో బ్లాక్ బస్టర్ తీసి చేతిలో పెడతా అన్నాడు. ఖర్చును పాతికకోట్లకు డేకించాడు వీలయినంత త్వరగా విడుదల చేద్దాం అన్నా కూడా, ఆఖరి పాట చాలా అవసరం అంటూ అప్పటికప్పుడు మరో 80లక్షలు ఖర్చుచేయించాడు. 

దీంతో 7న రావాల్సిన సినిమా 14న వచ్చింది. అసలు సినిమాను టేకాఫ్ చేయడమే చాలా ఆలస్యంగా చేసాడు. నాగబాబు చెబుతూనే వున్నారు. సెకండాఫ్ తేడా అని. దాన్ని అటు ఇటు చేయడానికే టైమ్ పట్టింది. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా, ఎప్పటికప్పుడు తోచింది చేసుకుంటూ వెళ్లారు. ఇలా వెళ్లి వెళ్లి పాతిక కోట్లు ఖర్చు చేయించారు.

ఇప్పడు సినిమా కాస్తా భయంకరమైన డిజాస్టర్ అయింది. నిర్మాతలకు 15 కోట్లకు పైగానే నష్టం మిగిలింది. అందుకే ఇప్పుడు శ్రీనువైట్లతో నిర్మాతలు పంచాయతీ పెట్టినట్లు తెలుస్తోంది. అంతన్నావ్.. ఇంతన్నావ్.. ఆఖరికి ఇంతలాస్ మిగిల్చావ్. ఈ లాస్ సంగతేమిటి? ఎంత పూడుస్తావు? ఎప్పుడు పూడుస్తావు? అని అడుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నిజానికి ఇలాంటి జవాబుదారీ డైరక్టర్లకు వుండాల్సిందే. లేదూ అంటే ఇలాంటి వాళ్ల వల్ల నిర్మాతలు గుల్లయిపోతున్నారు. ఆ మధ్య అఖిల్ కారణంగా వచ్చిన నష్టాలకు తాను కూడా బాధ్యత వహించి కొంత పూడ్చాడు డైరక్టర్ వినాయక్. అందువల్ల శ్రీనువైట్ల కూడా అలాగే చేస్తే బెటరేమో?