అన్నీ అనుకున్నట్టు జరిగితే, కరోనా కలకలం లేకపోయి ఉండుంటే ఈపాటికి ప్రదీప్ హీరోగా పరిచయమై ఉండేవాడు. అతడు నటించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా థియేటర్లలో నడుస్తూ ఉండేది. కానీ కరోనా వల్ల అతడి ఎంట్రీ లేట్ అయింది. అయితే సినిమా లేట్ అయినా ప్రదీప్ ప్రచారం మాత్రం ఆపలేదు.
కరోనా టైమ్ లో కూడా కొన్ని వెబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రదీప్, ఇప్పుడు లీకుల రూపంలో సినిమాకు ప్రచారం కల్పిస్తున్నట్టున్నాడు. తాజాగా ఈ సినిమా స్టోరీలైన్ కు సంబంధించి తెగ లీకులు వస్తున్నాయి. పునర్జన్మల కాన్సెప్ట్ ఇందులో ఉందని, మళ్లీ జన్మించిన హీరోహీరోయిన్లు ఎలా ప్రేమలో పడతారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చిందంటూ తెగ లీకులోస్తున్నాయి.
నిజానికి ఈ సినిమా స్టోరీలైన్ కు సంబంధించి గతంలోనే గ్రేట్ ఆంధ్రలో కథనం ఇచ్చాం. హీరోహీరోయిన్లు ఒకరికొకరు మారిపోతారు. హీరో శరీరంలోకి హీరోయిన్, హీరోయిన్ బాడీలోకి హీరో ఎంటరైపోతారన్నమాట. ఆ తర్వాత వాళ్లు 30 రోజులు ఎలా ప్రేమించుకున్నారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ప్రస్తుతం ఓ సెక్షన్ మీడియాలో వినిపిస్తున్నట్టు ఇందులో పునర్జన్మ కాన్సెప్ట్ కూడా ఉంది. కాకపోతే ఆ ఎలిమెంట్ చాలా కొద్ది పార్ట్ మాత్రం ఉంటుంది. మిగతాదంతా ఇంతకుముందు గ్రేట్ ఆంధ్ర చెప్పినట్టు శరీరాలు-ఆత్మలు స్వైపింగ్ కాన్సెప్ట్ తోనే సినిమా ఎక్కువగా నడుస్తుంది.