చైనాలోని వుహాన్ లో 76 రోజుల తర్వాత లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేశారు. కరోనా చేత తీవ్రంగా బాధించబడిన ప్రాంతం ఇది. చైనీ ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ ను అత్యంత కఠినంగా అమల్లో పెట్టింది. అయితే చివరకు కరోనా తగ్గుముఖం పట్టడంతో అక్కడ లాక్ డౌన్ ను ఎత్తేశారు. జనజీవనం అక్కడ సాధారణ స్థితికి వచ్చిందట. ఈ నేపథ్యంలో జనాలు ఇన్నాళ్లూ పెండింగ్ లో పడిన అంశాల మీద ఇప్పుడు దృష్టి పెట్టారని వార్తలు వస్తున్నాయి.
కరోనాతో ఆగిపోయిన కార్యాల్లో పెళ్లిళ్లు కూడా ముఖ్యమైనవి. మన దగ్గర కూడా ఈ సమ్మర్ లో చాలా మంది మ్యారేజ్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్లు జరిగే పరిస్థితి లేదు. కొంతమంది సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా వాయిదాలు పడిన వార్తలు వస్తున్నాయి. అసలే అది చైనా. లాక్ డౌన్ వేళ అన్నీ ఆగిపోయాయి. అలా లాక్ డౌన్ ముగియగానే ఇప్పుడు అక్కడి జనాలు పెళ్లిళ్ల అప్లికేషన్లను ప్రభుత్వానికి పెట్టుకుంటున్నారట.
చైనాలో పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలు కనాలన్నా.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి లాంటిది! ఈ నేపథ్యంలో తాము పెళ్లి చేసుకోవాలంటూ అనేక మంది ఆన్ లైన్ లో అప్లికేషన్లు పెట్టుకుంటున్నారట. మామూలుగా వచ్చే అప్లికేషన్లతో పోలిస్తే.. ఇప్పుడు 300 శాతం అప్లికేషన్లు పెరిగాయని, ఇన్నాళ్లూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పెళ్లిళ్లను వాయిదా వేసుకున్న వాళ్లంతా ఇప్పుడు ఒక్కసారి అప్లికేషన్లను పెట్టుకుంటున్నారని అందుకే ఈ శాతం భారీగా పెరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారట! రేపు ఇండియాలో కూడా లాక్ డౌన్ ఎత్తేశాకా.. వరసగా పెళ్లిళ్లు ఉంటాయేమో!