మేధావి వర్గ దర్శకులతో ఒకటే సమస్య. వాళ్లు అనుకున్నదే జనాల మీదకు వదుల్తారు తప్ప, జనాలకు కావాల్సింది వాళ్లు అందివ్వరు. డైరక్టర్ గా సుకుమార్ కూడా ఇదే టైపు. నిర్మాతగా అయితే ఆయన బిసి సెంటర్లకు కావాల్సిన కుమారి 21ఎఫ్ లు అందిస్తారు కానీ, దర్శకుడిగా మాత్రం ఆయన అంతనంత ఎత్తులోవుంటారు. అందుకే జగడం, ఆర్య-2 నేనొక్కడినే లాంటి నిరాశపర్చిన సినిమాలు తప్పలేదు. అదృష్టం బాగుండి నాన్నకు ప్రేమతో కాస్త ఆడింది. లేదూ అంటే పాపం, ఎన్టీఆర్ అభిమానులకు కూడా నిరాశే మిగిలేది.
లేటెస్ట్ గా సుకుమార్ తన ప్రయోగం రామ్ చరణ్ మీద చేస్తున్నారు. పక్కా పల్లెటూరి ప్రేమకథ, అది కూడా 1990ల కాలంలో, సెల్ ఫోన్ లు, ఇంటర్ నెట్ లు లేని రోజుల్లో, అది కూడా కాస్త చెవిటివాడి వ్యవహారం అని ఇప్పటికే బయటకు వచ్చింది. దీనికి తోడు ఇదే రామ్ చరణ్ గెటప్ అంటూ సోషల్ నెట్ వర్క్ లోకి ఓ స్టిల్ వచ్చేసింది. రంగుల కట్ బనీను, నిక్కరు ఆపై లుంగీ, గుబురు గెడ్డంతో వున్నాడు రామ్ చరణ్. ఈ గెటప్ తో, ఆ కథతో ఏవిధంగా ప్రేక్షకులను, ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ ను సుకుమార్ రంజింపచేయబోతున్నారో చూడాలి.
చరణ్ సినిమా అంటే డ్యాన్స్ లు, ఫైట్లు విరగదీయాలి. మాస్ పాటలు వుండాలి. మరి కనీసం డ్రీమ్ సాంగ్స్ ఏమైనా వుంటయోమో అని ఫ్యాన్స్ ఆశగా వున్నారు. మండిపోతున్న ఎండల్లో గోదావరి జిల్లాలో లెంగ్తీ షెడ్యూలుతో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రెండు హిట్ లు కొట్టిన మైత్రీ మూవీస్ హ్యాట్రిక్ కోసం చేస్తున్న ప్రయత్నం ఇది.