రాజకీయాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు పడి తీరాల్సిందే. ఎందుకంటే, ఇప్పుడు రాజకీయం అంటే ఓ అసహస్యం.. అంతకు మించి.! రాజకీయ నాయకుల్ని జనం పురుగుల్లా చూస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్. అయితే, మీడియా పార్టీల వారీగా విడిపోవడంతో, ఆ రాజకీయ కంపు కొందరికి ఇంపుగా మారిపోతోంది. ఫలితంగా, రాజకీయం తాలూకు అసలు రంగు, అనేక కారణాలతో ప్రపంచానికి సరిగ్గా కన్పించని దుస్థితి నెలకొంది.
ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లో 'మార్పు' దిశగా ఎవరు అడుగేసినా కాదనలేం. గత కొన్నాళ్ళుగా తమిళనాడులోని రాజకీయ పరిస్థితుల్ని చూస్తోంటే, అక్కడ 'మార్పు' దిశగా అడుగులు పడ్తున్నాయా.? మరింత పతనావస్థ దిశగా రాజకీయం పరుగులు పెడ్తోందా.? అన్న భిన్నమైన ప్రశ్నలు తెరపైకి రాకుండా వుండవు. జల్లికట్టు విషయంలో తమిళనాడు ప్రజానీకమంతా ఒక్కటైంది. అన్ని రాజకీయ పార్టీలూ రాజకీయాల్ని పక్కన పెట్టేశాయి. దెబ్బకి కేంద్రం దిగొచ్చింది. వారెవ్వా.. జనం ఐక్యంగా ముందడుగు వేస్తే, కేంద్రమైనా సరే, అబ్బా.. అనాల్సిందేనని అంతా అనుకున్నారు.
కానీ, తమిళనాడు రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఒక్కసారిగా అందరి అంచనాలూ తల్లకిందులయ్యాయి. కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. గవర్నర్తో హైడ్రామా నడిపించింది. ఈ ఎపిసోడ్లో శశికళ జైలుకెళ్ళడాన్ని అంతా సమర్థించారేమోగానీ, ఆమె అలా జైలుకెళ్ళేలోపు, మొత్తం వ్యవస్థను కేంద్రం సర్వనాశనం చేయడాన్ని మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోయారన్నది నిర్వివాదాంశం.
అక్కడికి, కథ అలా ముగిసిందనుకుంటే పొరపాటే. ఇప్పుడు, తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దయ్యింది. ఇది ఎవరూ ఊహించని విషయమే. నిజానికి ఇది చాలా పెద్ద షాక్. 'ఓటర్లకు డబ్బు పంచుతున్నారు..' అన్న కారణంగా ఉప ఎన్నిక రద్దయ్యిందన్నమాట వినడానికి ప్రజాస్వామ్యవాదులకు ఎంతో ఇంపుగా అన్పిస్తుంది. ఇది 'మార్పు'కి సంకేతం అయితే, ఎవరైనా సరే స్వాగతించి తీరాల్సిందే. ఎన్నికల్లో డబ్బు ఎవడు పంచాలనుకున్నాసరే, భయపడాల్సిందే ఇకపై. ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దుతో ప్రధాన రాజకీయ పార్టీలకు జరిగిన నష్టం అలాంటిది మరి.
ఇక్కడే పెద్ద అనుమానం వుంది. అదేంటంటే, తమిళనాడుని మాత్రమే కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు ప్రయోగ శాలగా భావిస్తున్నట్టు.? అని. మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. పెద్దయెత్తున నేతలు డబ్బు ఖర్చు చేశారక్కడ. ఇది ఓపెన్ సీక్రెట్. మరి, ఆ ఎన్నికలు ఎందుకు రద్దు కాలేదు.? పార్టీ ఫిరాయింపుల పేరుతో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటోంటే, ఆ వ్యవహారానికి అడ్డుకట్ట ఎందుకు వేయట్లేదు.? ఒక్క ఎమ్మెల్యే ఓటు కోసం ఐదు కోట్లు బేరం కుదుర్చుకుని, 50 లక్షల అడ్వాన్స్ ఇవ్వబోతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే, ఆ ఎన్నిక ఎందుకు రద్దవలేదు, టీడీపీపైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని బ్రీఫింగ్ చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.? అలాగే, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ డబ్బు ఖర్చు చేయకుండా నేతలు ఎన్నికల్లో సందడి చేశారంటే నమ్మేదెలా.! బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల నేతలూ డబ్బులు పంచుతూ, మీడియాకి అడ్డంగా దొరికేశారు. అయినా అది ఎన్నికల కమిషన్ కళ్ళకు కన్పించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమో.!
'ప్రజాస్వామ్య పరిరక్షణ' పేరుతో, కేంద్రంలో అధికారం వెలగబెడ్తోన్న బీజేపీ, తమిళనాడుని తన రాజకీయ అవసరాల కోసం ప్రయోగశాలగా మార్చేసిందన్నది నిర్వివాదాంశం. 'చెడు' నశించాల్సిందే.. కానీ, తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికీ, ప్రత్యర్థిని చిత్తు చేయడానికి మాత్రమే 'చెడు'పై పోరాటమనే కలరింగ్ ఇస్తేనే.. పరిస్థితులు ప్రమాదకరంగా మారిపోతాయ్. ఇలాంటి సందర్భాల్లోనే, 'అసలు మేం దేశంలో భాగమేనా.?' అన్న అనుమానాలూ తెరపైకొస్తాయ్.