సూపర్ స్టార్.. ఫ్లాఫ్ సినిమా ఫార్ములానే రిపీట్ చేశాడు.

భారీ బడ్జెట్ సినిమా అంటే.. మేకింగ్ కు వీలైనంత ఎక్కువ సమయాన్ని తీసుకోవాలనేది దకిణాది మూవీ మేకర్లు పెట్టుకున్న ప్రాథమిక నియమం. దీనికి సాకంగా అనేక తెలుగు, తమిళ సినిమాలు కనిపిస్తాయి. ఒకరిదని కాదు..…

భారీ బడ్జెట్ సినిమా అంటే.. మేకింగ్ కు వీలైనంత ఎక్కువ సమయాన్ని తీసుకోవాలనేది దకిణాది మూవీ మేకర్లు పెట్టుకున్న ప్రాథమిక నియమం. దీనికి సాకంగా అనేక తెలుగు, తమిళ సినిమాలు కనిపిస్తాయి. ఒకరిదని కాదు.. భారీ పెట్టుబడులు పెడుతున్న వారి తీరంతా ఇంతే! మరి ఇందుకు భిన్నమైన హీరోగా వరసగా రెండో సారి నిలుస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అతి వేగంగా సినిమాలు చేసుకొంటూ పోతున్నాడు సూపర్ స్టార్ .

'లింగా' అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత వేగంగా రూపొందించబడ్డ సినిమా. కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాలుగైదు నెలల్లోనే పూర్తి కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల అయ్యింది. ఆ తర్వాత కొంత విరామం అయితే తీసుకున్నాడు కానీ.. ఇప్పుడు కేవలం 120 రోజుల్లోపు వర్క్ తోనే 'కబాలి' సినిమాను పూర్తి చేసింది రజనీ అండ్ కో!

ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే. దేశ, విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇంత త్వరగా పూర్తి కావడం పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. దకిణాది లో భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే వారందరికీ భిన్నంగా రజనీ దూసుకుపోతున్నాడు. ఇంత వరకూ ఈ వ్యవహారం అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చేదే. అయితే వేగవంతంగా పూర్తి చేసిన 'లింగా' బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ వేగం విషయంలో రజనీ 'కబాలి' కి కూడా 'లింగా' ఫార్ములాకే కట్టుబడ్డాడు. మరి కబాలి కి మాత్రం అలాంటి జాడ్యమేదీ తగలకూడదని ఆశిద్దాం.