సురేందర్ రెడ్డికి కిక్ దిగడంలేదు

ఎవరిపిల్ల వారికి ముద్దు..అది కోడిపిల్ల అయినా, పిల్లి పిల్లయినా. డైరక్టర్ సురేందర్ రెడ్డి వ్యవహారం అలాగే వుందట. ఆయన తీసిన సినిమాలు ఎన్నో, వాటిలో డిజాస్టర్లు ఎన్నో, అట్టర్ ఫ్లాపులెన్నో జనాలకు తెలుసు. వాటిలో…

ఎవరిపిల్ల వారికి ముద్దు..అది కోడిపిల్ల అయినా, పిల్లి పిల్లయినా. డైరక్టర్ సురేందర్ రెడ్డి వ్యవహారం అలాగే వుందట. ఆయన తీసిన సినిమాలు ఎన్నో, వాటిలో డిజాస్టర్లు ఎన్నో, అట్టర్ ఫ్లాపులెన్నో జనాలకు తెలుసు. వాటిలో నటించిన హీరోలకు తెలుసు. ఒకరు కాదు.

దాదాపు చాలా మంది హీరోలు సురేందర్ రెడ్డి బారిన పడి, ఫ్లాపులు చవి చూసినవారే. అయినా ఏదో ఒక పాయింట్ లో లొంగి అవకాశం ఇవ్వడం, అపజయాన్ని రుచి చూడడం అలవాటైపోయింది..రేసుగుర్రం విషయంలో అల్లు అరవింద్ ఫైనల్ ప్రొడక్ట్ కోసం ఎంత కిందా మీదా పడ్డారో టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లు ఇప్పటికీ చెప్పుకుంటాయి.

ఆయన కెరీర్ బెస్ట్ కిక్. వక్కతం వంశీ వచ్చేసిన సినిమా కథలు మిక్సీ వేసి రుబ్చేసి, తాళింపు పెట్టడంలో స్పెషలిస్ట్ అని ఆ సినిమానే తెలియచెప్పింది. జెంటిల్ మన్ సినిమా కథను తీసుకుని, కిక్ కోసం తపించే క్యారెక్టర్ ను జోడించి ఆ సినిమా కథ తయారుచేసాడు. హిట్ అయిపోయింది. ఇప్పుడు ఖలేజా సినిమాను అటు ఇటు చేసి, కిక్ 2 అనుకోమన్నాడు.

దీని వెనుక ఓ ముచ్చట టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ కథను ముందుగా సూపర్ స్టార్ మహేష్ కు వినిపించారట. ఆయన సాంతం వినేసి..చేసిన సినిమా మళ్లీ చేయమంటారా అని అడిగారట..తనదయిన స్టయిల్ లో చిరునవ్వు నవ్వుతూ. అంతే మారు మాట లేకుండా వెనక్కు వచ్చారని వినికిడి. దాన్ని రవితేజ, కళ్యాణ్ రామ్ లకు చెప్పి ఒప్పించి, కిక్ 2 చేసారు. అసలు కిక్ 2 అనకుండా వేరే సినిమాగా తీసినా సరిపోతుంది ఇది.

సరే, అయిపోయింది అయింది. మిక్స్ డ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు ఫరవాలేదు.. ఆ సంగతి అలా వుంచితే, సురేందర్ రెడ్డి మాత్రం తాను ఇప్పటికీ ఓ అద్భుతమైన సినిమా అందించాననే భ్రమలోనే వున్నారని వినికిడి. ఎమోషన్, యాక్షన్ పీక్ లో వుండి, కామెడీ అద్భుతంగా పండిన సినిమా తీసాననే సురేందర్ రెడ్డి వాదిస్తున్నారట.  విన్నవాళ్లు ఏమని చెప్పాలో తెలియక, ఆ తరువాత సినిమా జనాలతో చెప్పుకుని తలభారం దించుకుంటున్నారు.

ఇప్పుడు సురేందర్ రెడ్డి తరువాతి టార్గెట్ రామ్ చరణ్. అయితే అది మెగా  క్యాంప్ కాబట్టి, ఇలాంటి పప్పులు అక్కడ ఉడకవు. చిత్తానికి  కోట్లు ఖర్చు చేయిస్తానంటే సాగదు. నాలుగు సినిమాలు చూసి, మిక్సీలో రుబ్బేసి, అట్టేసి అందిస్తామనంటే అస్సలు కుదరదు. బుద్దిగా చేయాల్సిందే. అవకాశం ఇస్తే జాగ్రత్తగానే చేస్తారు అక్కడ. విజయం కావాలి కదా.

కానీ తరువాత మళ్లీ ఎవరో ఒకరు దొరుకుతారు..బకరా అయిపోతారు. అది గ్యారంటీ. ఎందుకంటే గతం చెపుతున్న విషయం అదే కదా.