తెలుగు చిత్ర రంగంలో యాభై అయిదేళ్ల అనుభవం వున్న సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, స్పాన్సర్డ్ సినిమా అయినా, అన్నింటికీ అదే బ్యానర్. కానీ ఇటీవల రెండు మూడు విషయాలు నిర్మాత సురేష్ బాబు, ఆయనకు వ్యాపార విషయాల్లో తోడుగా వుండే రానా గమనించారట.
వేరే వాళ్లకు బ్యానర్ ఇస్తుంటే, అవి సరైన సినిమాలు కాకపోతే, బ్యానర్ పరువు దెబ్బతింటోంది. సురేష్ మూవీస్ నుంచి ఇలాంటి సినిమానా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయట. అందుకే మరో బ్యానర్ ఫ్లోట్ చేయాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని సురేష్ బాబునే స్వయంగా చెప్పారు.
'సురేష్ మూవీస్ బ్యానర్ అంటే ఓ పేరు వుంది. మంచి సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు అని జనం అంచనా వేస్తారు. మరీ లో ప్రొడక్షన్ వాల్యూస్ వున్నవి, బూతులు, ఇతరత్రా సినిమాలు అనుకోకుండా ఈ బ్యానర్ లోకి వచ్చిన సందర్భాలు ఇటీవల గమనించాం. సురేష్ మూవీస్ బ్యానర్ అంటే మినిమమ్ ఎక్స్ పెక్టేషన్స్ వుంటాయి. అందుకే ఇకపై మరో బ్యానర్ మీద బయటవాళ్ల సినిమాలకు సహకరిస్తూ, మేము స్వయంగా తీసే సినిమాలకు మాత్రమే సురేష్ బ్యానర్ ను వాడతాం' అని ఆయన వివరించారు.
ఇప్పటికే గీతా, హారిక హాసిని లాంటి సంస్థలు ఇదే తీరుగా రెండేసి బ్యానర్ లు స్టార్ట్ చేసాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ ఓ గీత గీసుకుని ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు సురేష్ నుంచి కూడా మరో బ్యానర్ అలా వస్తుందన్నమాట.