ఎన్టీఆర్ చేసిన పని చిరు చేయలేకపోతున్నాడా?

త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రం చేస్తున్నాడు ఎన్టీఆర్. అటు చిరంజీవి తన ప్రతిష్టాత్మక సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ రెండూ ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. రెండూ లీకేజీల బారిన పడ్డాయి.…

త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రం చేస్తున్నాడు ఎన్టీఆర్. అటు చిరంజీవి తన ప్రతిష్టాత్మక సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ రెండూ ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. రెండూ లీకేజీల బారిన పడ్డాయి. అయితే అరవింద సమేత యూనిట్ వెంటనే మేల్కొంది. గట్టి చర్యలు తీసుకుంది. సైరా యూనిట్ మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకబడి ఉంది.

సైరా సినిమాకు సంబంధించి గతంలో కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. ఆ వెంటనే యూనిట్ అప్రమత్తమైందంటూ వార్తలొచ్చాయి. ఇక సైరా నుంచి ఎలాంటి లీకులు ఉండవని భావించారు. కానీ తాజాగా మరో 3 స్టిల్స్ బయటకొచ్చాయి. అవి కూడా సినిమాలో అత్యంత కీలకమైన ఘట్టానికి సంబంధించిన ఫొటోలు.

కోట ప్రహరీకి సంబంధించిన భారీ సెట్ నిర్మాణం. ఆ నిర్మాణం లోపల బ్రిటిష్ సైనికులు, బయట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైనికులు. పైనుంచి సైనికుల కాల్పులు. కింద నుంచి నరసింహారెడ్డి సేనల ఎదురుదాడి. ఇలాంటి కీలకమైన ఘట్టానికి సంబంధించిన స్టిల్స్ లీక్ అయ్యాయి. దీంతో యూనిట్ ఒక్కసారిగా అవాక్కయింది.

సాధారణంగా ఇలాంటి లీకేజ్ స్టిల్స్ సినిమాపై హైప్ తీసుకొస్తుంటాయి. కానీ కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు లీక్ అయితే మాత్రం సినిమాపై ఉత్సుకత తగ్గిపోతుంది. అదే ఇప్పుడు సైరా యూనిట్ భయం. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మరోవైపు అరవింద సమేతకు సంబంధించి కూడా ఈ బెడద ఉంది. సినిమాలో కీలకమైన ఫ్యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన స్టిల్ లీక్ అయింది. అయితే అది లీక్ అయిన వెంటనే యూనిట్ అప్రమత్తమైంది. దీంతో ఆ స్టిల్ తర్వాత మళ్లీ లీకుల్లేవ్. ఈ విషయంలో సైరా యూనిట్ మాత్రం సక్సెస్ కాలేకపోతోంది.