చిరంజీవి ఇక్కడ, యూనిట్ అక్కడ.. మరి షూటింగ్?

సైరా యూనిట్ జార్జియా వెళ్లింది. అక్కడే ఓ అందమైన లొకేషన్ లో టెంట్లు వేసింది. షూటింగ్ కోసం హడావుడిగా పరుగులు పెడుతున్న యూనిట్ సభ్యుల వీడియోను కూడా విడుదల చేసింది. అత్యంత కీలకమైన యుద్ధ…

సైరా యూనిట్ జార్జియా వెళ్లింది. అక్కడే ఓ అందమైన లొకేషన్ లో టెంట్లు వేసింది. షూటింగ్ కోసం హడావుడిగా పరుగులు పెడుతున్న యూనిట్ సభ్యుల వీడియోను కూడా విడుదల చేసింది. అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశాలను తీయబోతున్నామంటూ ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ యుద్ధాలు చేయాల్సిన హీరో ఎక్కడ?

అవును.. చిరంజీవి మాత్రం జార్జియాలో లేరు. ఆయనింకా హైదరాబాద్ లోనే ఉన్నారు. యూనిట్ అంతా జార్జియాలో ఉంటే చిరంజీవి మాత్రం ఇంకా హైదరాబాద్ లోనే సేదతీరుతున్నారు. పనిలోపనిగా కొన్ని చిన్న సినిమాలకు ప్రచారం ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంతకీ చిరంజీవి లేకుండా జార్జియాలో యూనిట్ ఏం చేస్తోంది?

ప్రస్తుతం జార్జియాలో ఎలాంటి షూటింగ్ జరగడం లేదు. కేవలం రిహార్సల్స్ మాత్రమే జరుగుతున్నాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటేకర్ ఆధ్వర్యంలో యుద్ధ సన్నివేశాలకు సంబంధించి రిహార్సల్స్ ప్రారంభించారు. అంతా సజావుగా సాగుతుందని నిర్థారించుకున్న తర్వాత చిరంజీవి అక్కడికి వెళ్తారు. 

మరోవైపు చిరంజీవి కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి జార్జియాలో. అతడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏకంగా ఆరుగురు చెఫ్ లను ఏర్పాటుచేస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. వీళ్లంతా చిరంజీవికి కావాల్సిన ఇండియన్ వంటకాల్ని సిద్ధంచేస్తారన్నమాట. 

మరోవైపు చిరంజీవి ఉండడానికి భారీ కారవాన్ ను కూడా అక్కడ సిద్ధంచేశారు. సైరా సినిమాకు సంబంధించి ఇది కీలకమైన యుద్ధ సన్నివేశం అంటోంది యూనిట్. జార్జియా వెళ్లి మరీ ఈ సన్నివేశాల్ని ఎందుకు తీస్తున్నారో సినిమా చూస్తే అర్థమౌతోందట. వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి రానుంది సైరా.