విశ్వాసం కీలకం. రుణం తీర్చుకోవడం ముఖ్యం. జన్మనిచ్చిన తల్లిని మరువకూడదు. రాజకీయ జన్మనిచ్చిన పార్టీని మరువకూడదు. అందుకే తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ రుణాన్ని చంద్రబాబు ఈ విధంగా తీర్చుకుంటున్నారు.
హమ్మయ్య.. మొత్తానికి వైకాపాకు ఓ తలకాయనొప్పి వదిలింది. నిన్నమొన్నటి దాకా తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ అంటూ ఒకటే గోల. ఇక ఆ మాట పొరపాటున కూడా అనలేరు. పైగా భాజపాతో మిలాఖత్ అని కూడా అనడానికి లేదు. ఎందుకంటే, పార్టీ సిద్దాంతాలకు సైతం తిలోదాకాలు ఇచ్చి, కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అలాంటిది భాజపాతో వైకాపా పొత్తు పెట్టుకోకున్నా, ఎలా విమర్శిస్తుంది? అలా అనడానికి బుద్ది, బుర్ర రెండూ వుండాలి. లేవు.. అని అంటే ఎవరు ఏమి చేయలేరు.
ఇక విభజన పాపం అంటుకుని విలవిలలాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పంచెలు సవరించుకుని, ఇస్త్రీ చొక్కాలు తొడుక్కుని, ఫుల్ హ్యాపీగా బయటకు రావచ్చు. జనం పొరపాటున ఎవరైనా ఏమైనా అంటారనే భయం అక్కరలేదు. పైగా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ కు తెలుగురాష్ట్రాల్లో మీడియా అండ లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ నాయకులకు మీడియా దన్ను కూడా పూర్తిగా దొరుకుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ఓ 14 సీట్లు దేశానికి విదిలిస్తే, ఆంధ్రలో రాబోయే ఎన్నికల్లో అదే మేరకు కాంగ్రెస్ కు తెలుగుదేశం విదిలించవచ్చు. అందువల్ల నాలుగేళ్లుగా ఇంట్లో నిరుద్యోగంతో వున్న కాంగ్రెస్ నాయకులు కొందరికైనా ఉపాథి దొరికే అవకాశం వుంది.
ఏమైతేనేం చంద్రబాబు తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ రుణం ఇలా తీర్చుకుంటున్నారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇందిరాగాంధీ ఆత్మ ఎక్కడున్నా, ఆ రోజుల్లో ఓ యంగ్ బాయ్ కు మంత్రిపదవి ఇవ్వడం ద్వారా ఇప్పుడు తన మనవడికి మంచి చేసా అని మురిసిపోతుంది.