తమిళం కోసం చాలా చేసాం-రానా

నేనే రాజు నేనే మంత్రి సినిమా కబుర్లు చాలా చెప్పుకువచ్చాడు రానా మీడియాతో. ముఖ్యంగా ఇది తెలుగు నుంచి తమిళంలోకి డబ్ చేసినిమా లా వుండదట. తమిళం కోసం వేరే వెర్షన్ తయారు చేసారట.…

నేనే రాజు నేనే మంత్రి సినిమా కబుర్లు చాలా చెప్పుకువచ్చాడు రానా మీడియాతో. ముఖ్యంగా ఇది తెలుగు నుంచి తమిళంలోకి డబ్ చేసినిమా లా వుండదట. తమిళం కోసం వేరే వెర్షన్ తయారు చేసారట. అక్కడ మాంచి రైటర్ ను పట్టుకుని పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు రాయించారట. అలాగే మన నటులకు బదులు తమిళ్ వెర్షన్ కోసం అక్కడి నటులను తీసుకున్నారట. ఇలా తమిళ వెర్షన్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పాడు.

ఇదిలా వుంటే రానా చెప్పకపోయినా ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుస వేరే వుంది. తమిళనాట మారిన రాజకీయాలు, అక్కడ ఎన్నికల వ్యవహారం, అది రద్దయిన తీరు, ఇవన్నీ చూసిన తరువాత స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేసి, చొప్పించారట. కానీ చెప్పడం మాత్రం అంతా కో ఇన్సిడెంట్ అని చెబుతున్నారనుకోండి.

ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ను తయారుచేసి, దానిచుట్టూ కథను తయారుచేసామని రానా చెప్పారు. ఓ సాదా సీదా వడ్డీ వ్యాపారి, అలా అలా రాజకీయాల్లోకి వచ్చి, అన్నీచూసి, చివరకు ఎలా మారిపోయాడు, అతని జీవితం ఎక్కడకు చేరిందన్నది నేనే రాజు నేనే మంత్రి కథ అని రానా చెప్పాడు.

రియలిస్టిక్ అప్రోచ్ వుంటుంది కానీ, కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అర్హతలు వుంటాయన్నారు. చెడ్డ మనిషిగా మారిన ఓ మంచి మనిషి జీవనయానమే నేనే రాజు నేనే మంత్రి సినిమా అన్నారు రానా. ఎవర్నీ, ఏ నాయకుడిని దృష్టిలో పెట్టుకుని సినిమా చేయలేదని, కానీ థియేటర్లో సినిమా చూస్తుంటే మాత్రం ఇలాంటి లీడర్ వుండే వుంటాడని అనిపిస్తుందన్నారు రానా. 

నేనే రాజు నేనే మంత్రి కథ ఓ రోజులో తయారు కాలేదని, మంచి పాయింట్ ను తీసుకుని, దర్శకుడు తేజ రాసిన ఓ ఫుల్ లైఫ్ స్టోరీని, ఏడెనిమిది నెలల పాటు చర్చించి, ఆలోచించి, కంటిన్యూగా ఎక్స్ ర్ సైజ్ చేసి, స్క్రిప్ట్ తయారుచేసామన్నారు. సినిమాను రియలిస్టింగ్ అప్రోచ్ లో వెళ్తూ, కమర్షియల్ ఫార్మాట్ ను దాటకుండా చూసుకున్నామన్నారు.