జూనియర్ ఎన్టీఆర్ తీరుపై సెటైర్లు వేస్తున్నారు… ఇది ఏ మెగా ఫ్యామిలీ అభిమానులో లేక మరొక హీరో అభిమానులో.. ఇంకో రీజన్ తో నందమూరి ఫ్యామిలీ తీరు పై జోకులు వేసే వాళ్లో చేస్తున్న పని కాదు! తెలుగుదేశం అభిమానులు చేస్తున్న పని. ఒకరకంగా కాదు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగానూ టార్గెట్ ఎన్టీఆర్ అనే ఆపరేషన్ నడుస్తోందిప్పుడు.
ఇన్ని రోజులూ కేవలం మెగా ఫ్యామిలీ హీరోలను, టాలీవుడ్ లో టాప్ పొజిషన్ మాది.. అంటూ వచ్చిన ఇతర హీరోలను టార్గెట్ గా చేసుకొంటూ సెటైర్లు వేసిన వారు ఇప్పుడు తమ లక్ష్యాన్ని మార్చుకున్నారు. తెలుగుదేశంపై తీవ్రాతితీవ్రమైన అభిమానాన్ని కలిగిన వారు… సినిమాల విషయంలో నందమూరి ఫ్యామిలీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇప్పుడు టార్గెట్ చిన్న ఎన్టీఆర్ అంటున్నారు. ఇన్ని రోజులూ ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ గా అభివర్ణించిన వాళ్లే ఇప్పుడు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఆన్ లైన్ లో ఈ మేరకు టార్గెట్ ఎన్టీఆర్ అంటూ దూసుకుపోతున్నారు తమ్ముళ్లు.
''రాసి పెట్టుకోండి.. ఇది నందమూరి నామ సంవత్సరం.. అనే జోక్ తో ఎన్టీఆర్ ఈ సంవత్సరాన్ని ప్రారంభించాడు… పేర్లు చెప్పుకుని బతకడం ఏ రోజూ నేర్పలేదు మా నాన్న.. ఈ జోక్ తో ఆయన ఈ సంవత్సరాన్ని ముగించాడు… ''
'' ఆ గుడివాడోడు నోటికి వచ్చిన బూతులు తిడతాడు…నువ్వేమో కట్టే కాలే దాకా తెలుగుదేశం అంటావ్….మళ్లీ వచ్చి లోకేష్ నా సినిమా ఆపాడు, బాలకృష్ణ డిస్ట్రిబ్యూటర్ లకి ఫోన్ చేస్తున్నాడు, చంద్రబాబు సినిమా నిర్మాతలతో టెలి కాన్ఫరెన్స్ చేసి నా సినిమా ఆపాడు అని ఏడుస్తావ్…నువ్వు తెలివిగల వాడివి అనుకున్నా, నీ స్నేహితుడు జగన్ టైపు నువ్వు కుడా….నీ ఖర్మ…''
ఇక నందమూరి అభిమాని ఆవేదన పేరుతో మరో ఆసక్తికరమైన పోస్టు చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టులో జూనియర్ ఎన్టీఆర్ ,కల్యాణ్ రామ్ లను లక్ష్యంగా చేసుకున్నారు. అసలు ఎన్టీఆర్ కు ఉన్న అభిమాన బలగాన్ని నిలబెట్టుకున్నది బాలయ్యేనని, బాలయ్య లేకపోతే ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ లను పట్టించుకునే నాథుడే ఉండడని.. ఎస్వీఆర్ మనవడు హీరోగా వస్తే ఎంత ముంది పట్టించుకున్నారు, ఒకవేళ బాలయ్యే లేకపోతే ఎన్టీఆర్ మనవళ్ల పరిస్థితి అలాగే ఉంటుందని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు బాబాయ్ నామస్మరణ చేయబట్టే వాళ్లను అభిమానించామని, ఈ రోజు పదవులు దక్కకపోయే సరికి వారు ఇలా వ్యవహరిస్తున్నారని.. ఇన్ని రోజులూ నందమూరి ఫ్యాన్స్ గా ఉన్నాం ఇకపై కేవలం బాలయ్య ఫ్యాన్స్ గా మాత్రమే ఉంటామనేది.. ఈ పోస్టు సారాంశం!
ఈ తరహాలో తెలుగుదేశం అభిమానుల నుంచి పోస్టులు వస్తున్నాయి. వీళ్లు ఎన్టీఆర్ పై సానుభూతి చూపిస్తున్నట్టుగానే వ్యవహరిస్తూ ఆక్రోశం వెల్లగక్కుతున్నారని స్పష్టం అవుతోంది. విశ్వసనీయంగా తెలిసిన విషయం ఏమిటంటే.. టార్గెట్ చిన్న ఎన్టీఆర్ ఆపరేషన్ కు పై నుంచి స్పష్టమైన ఆదేశాలే ఉన్నాయనేది.
నందమూరి భావోద్వేగాల నుంచి వీలైనంతగా ఎన్టీఆర్ ను దూరం చేయాలి.. అభిమానుల దృష్టిలో అతడు తప్పు చేస్తున్నాడనే ఫీలింగ్ ను కలిగించే లక్ష్యంతో వ్యూహాన్ని అమలు పెట్టాలనేది ట్రస్టు భవన్ ఆలోచన. అందుకు ఫేస్ బుక్ లో టీమ్ లను వాడుకుంటూ దూసుకుపోతున్నారు. మరి ఈ ప్రయత్నాలతో ఎన్టీఆర్ ను ఎంత వరకూ దెబ్బతీయగలరు.. ఎంతమంది అభిమానుల దృష్టిలో ఎన్టీఆర్ ను విలన్ గా చేయగలరు.. అనే అంశాలు ఆసక్తికరం.