ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 20

బ్రూసు రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి స్కోన్‌ అనే నగరానికి వెళ్లాడు. అక్కడ పట్టాభిషేకానికి కావలసిన ఏ సరంజామా లేదు. కిరీటం, రాజదండం, రాచదుస్తులు ఏమీ లేవు. బిషప్‌ పదేళ్లగా దాచిన స్కాట్లండ్‌ పతాకం అతని…

బ్రూసు రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి స్కోన్‌ అనే నగరానికి వెళ్లాడు. అక్కడ పట్టాభిషేకానికి కావలసిన ఏ సరంజామా లేదు. కిరీటం, రాజదండం, రాచదుస్తులు ఏమీ లేవు. బిషప్‌ పదేళ్లగా దాచిన స్కాట్లండ్‌ పతాకం అతని చేతిలో పెట్టి తన కుర్చీ, తన దుస్తులు యిచ్చి తంతుకు ఏర్పాట్లు చేశాడు. కిరీటానికి బదులు ఒక బంగారు వడ్డాణం సిద్ధం చేశారు. అయితే ఆ వడ్డాణాన్ని తలపై పెట్టవలసిన మనిషి మాత్రం రాలేదు. అలా పెట్టే హక్కు తరతరాలుగా ఫైఫ్‌ సామంతరాజు (థేన్‌)కి వుంది. ప్రస్తుతం ఫైఫ్‌కు సామంతరాజుగా వున్న వ్యక్తి ఎడ్వర్డుకు నమ్మినబంటు. అందుని రాలేదు. అయితే అతనికి ఒక సోదరి  వుంది – కౌంటెస్‌ ఆఫ్‌ బుచాన్‌ అని. ఆమె భర్త కూడా ఎడ్వర్డుకు విశ్వాసపాత్రుడే. పైగా కొమైన్‌కు బంధువు కూడా. అందువలన బ్రూసుపై పగబట్టాడు. అయితే కౌంటెస్‌ మాత్రం స్కాట్లండ్‌పై అభిమానంతో తన సోదరుడికి బదులుగా బ్రూసు తలపై ఆ 'కిరీటం' పెట్టడానికి సిద్ధపడింది. తనంటే గౌరవం వున్న ధర్మవీరుల (నైట్స్‌)ను వెంట తీసుకుని వచ్చి అతన్ని రాజుగా అభిషేకించింది. అలా రాజ్యం లేని రాజుగా బ్రూసు స్కాట్లండ్‌కు రాజయ్యాడు. అతని భార్య రాణి అయింది.

ఈ మాట వినడంతో ఎడ్వర్డు ఆవేశపడ్డాడు. అప్పటికే అతను ముసలివాడయ్యాడు, జబ్బు పడ్డాడు. నైట్స్‌ను, సామంతరాజులను తీసుకుని స్కాట్లండ్‌పై యుద్ధానికి బయలుదేరదా మనుకున్నాడు. సాటి క్రైస్తవుడిపై యిదే తన చివరి యుద్ధమని, దీని తర్వాత పాలస్తీనా వెళ్లి క్రైస్తవుల తరఫున మతయుద్ధాలలో పాల్గొందామని నిశ్చయించుకున్నాడు. తనకు ఓపిక తక్కువగా వుంది కాబట్టి యువరాజు (ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ అంటారు) రెండో ఎడ్వర్డును సైన్యంతో ముందుగా వెళ్లమన్నాడు. వాళ్లు స్కాట్లండ్‌ ప్రవేశించాక దారిలో కనబడిన గ్రామాలను దగ్ధం చేస్తూ, నాశనం చేస్తూ ముందుకు సాగారు. పైర్త్‌ పట్టణం చేరేసరికి అక్కడకు బ్రూసు తన సైన్యంతో ఎదురై యుద్ధం చేద్దామని ఆహ్వానించాడు. 'కొద్ది సేపటిలో చీకటి పడబోతోంది. రేపు చేద్దాం' అన్నాడు ఇంగ్లీషు సేనాపతి. దానికి ఒప్పుకుని బ్రూసు సమీపంలో వున్న అడవికి వెళ్లి విశ్రమించాడు. సైన్యం కవచాలు విప్పేసి, ఆయుధాలు పక్కన పడేసి నడుం వాల్చినపుడు ఇంగ్లీషు సేన దొంగచాటుగా మీదపడింది. భీకరయుద్ధం జరిగింది. దాన్ని బేటిల్‌ ఆఫ్‌ మెత్వెన్‌ అంటారు. బ్రూసు సేన చావుదెబ్బ తింది. బ్రూసుకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు మూడు సార్లు పట్టుబడి, యితరులు కాపాడగా ప్రాణాలు చేతపట్టుకుని పారిపోయాడు. 

ఇక అప్పణ్నుంచి అతని గురించి వేట ప్రారంభమైంది. సజీవంగా కానీ నిర్జీవంగా కాని పట్టిచ్చినవారికి బహుమతి, సాయపడినవారికి శిరచ్ఛేదం అని ఎడ్వర్డు ప్రకటించాడు. కానీ కొందరు దేశభక్తులు అతనికి ఆశ్రయం యిచ్చేవారు. బికారుల్లా, శరణార్థుల్లా బ్రూసు, అతని సైన్యం  ఉన్న చోట ఉండకుండా, తిన్న తోట తినకుండా వేటగాడి నుంచి తప్పించుకునే జంతువుల్లా నిరంతరం పరుగులు పెడుతూ కందమూలాలు తింటూ, గుహల్లో దాక్కుంటూ పోరాటాన్ని కొనసాగించారు. తన భర్త యిలా కష్టపడుతూ వుంటే తను అబెర్డీన్‌ రాజభవనంలో వుండడమేమిటని బ్రూసు భార్య అనుకుంది. ఒక రోజు మరిది నైజల్‌ బ్రూస్‌ను వెంటపెట్టుకుని అడవిలో భర్త వద్దకు వచ్చేసింది. ఆమె వచ్చినందుకు బ్రూసు సంతోషించినా తనతో పాటు ఆడవాళ్లు కూడా కష్టాలపాలవడం అతన్ని కలచివేసింది. ఒకరోజు ఆమెకు నచ్చచెప్పి కిల్‌డ్రమ్మీ కోటకు పంపించివేశాడు. అదొక్కటే అతని ఏలుబడిలో వుంది. అప్పటికి బ్రూసు వద్ద 200 మంది వీరులున్నారు. వారెవ్వరికీ గుఱ్ఱాలు లేవు. అందుకని అతను వారందరినీ తీసుకుని ఐర్లండ్‌ తీరానికి దూరంగా వున్న దీవికి వెళ్లాడు. అక్కడ విపరీతమైన చలి. అయినా శత్రువులకు అందకుండా వుండాలంటే భరించక తప్పదు. 

బ్రూసు పారిపోయాడన్న వార్త విని ఎడ్వర్డు మండిపడి అతని భార్య వున్న కోటపై దాడి చేయించాడు. రక్షణకు నిలిచిన నైట్స్‌ను చంపి బ్రూసు భార్యను, కూతుర్ని, అక్కచెల్లెళ్లను తక్కిన స్త్రీలను ఖైదీలుగా పట్టి ఇంగ్లండు, స్కాట్లండ్‌ చెరసాలల్లో పడేశాడు. బ్రూసు తమ్ముడు నైజల్‌ను అతి దారుణంగా చంపించాడు. పట్టుబడిన వాళ్లలో బుచాన్‌ కౌంటెస్‌ కూడా వుంది. బ్రూసు తలపై కిరీటం పెట్టే దుస్సాహసం చేసినందుకు గాను ఆమెను కఠినంగా శిక్షించదలచాడు. ఆమె భర్త, సోదరుడు తనకు ఆప్తులైనా సరే పట్టించుకోలేదు. చెక్క, యినుముతో ఒక పెద్ద పంజరం చేయించి బెరిక్‌ కోటలో గోడకు దాన్ని వేళ్లాడ దీసి ఆమెను కౄరజంతువులా దాన్లో పెట్టాడు. కోటలో తిరుగాడేవాళ్లు ఆమెను చూసి రాజు అభీష్టానికి వ్యతిరేకంగా మెలగితే ఏమవుతుందో అర్థం చేసుకోవాలన్నమాట. ఆమెతో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. తిండి పెట్టే పనివాళ్లు తప్ప వేరెవరూ దగ్గరకు రావడానికి వీల్లేదు. 

పరిస్థితి యింత ఘోరంగా తయారైనందుకు బ్రూసు చాలా ఖేదపడ్డాడు. ఒక రోజు తను తలదాచుకున్న గుడిసెలో గడ్డిపరుపుపై పడుక్కుని ఆలోచనామగ్నుడయ్యాడు – ఏ ఆశతో నేను పోరాటం కొనసాగించాలి అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. నా సహచరులను ఎడ్వర్డుకి లొంగిపొమ్మని చెప్పి నేను పాలస్తీనా వెళ్లి మతయుద్ధాలలో క్రైస్తవం గురించి పోరాడుతూ మరణిస్తాను, ఆ విధంగా కొమైన్‌ను చంపిన పాపానికి ప్రక్షాళన జరుగుతుంది అనుకున్నాడు.  ఇంతలో అతని చూపు గుడిసె కప్పుపై పడింది. అక్కడ ఒక సాలీడు గూడు కడుతోంది. ఒక దూలాన్ని పట్టుగా చేసుకుని మరొక దూలాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ అందుకోలేక జారిపోతోంది. 'ఇది కూడా నాలాగే వుంది. ఎప్పటికైనా సాధిస్తుందో లేదో చూడాలి' అని అతను గమనించసాగాడు. పడిపోయిన ప్రతీసారి సాలీడు పట్టు విడవకుండా మళ్లీ ప్రారంభిస్తోంది. ఆరుసార్లు విఫలమైంది. 'ఇది ఎప్పటికైనా పట్టుకోగలుగుతుందో లేదో' అని చూస్తూ దానితో మమేకమయ్యాడు. చివరకు ఏడోసారి అది విజయం సాధించినప్పుడు ఆ విజయం తనే సాధించినట్లు భావించాడు. 'సాలీడు వంటి చిన్న జీవికి వున్న పట్టుదల నాకు లేకపోతే ఎలా?' అనుకుని నిరాశలోంచి బయటకు వచ్చాడు. మళ్లీ ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. (సశేషం)  (చిత్రాలు – బ్రూసు పట్టాభిషేకం, సాలీడుతో బ్రూసు)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

Click Here For Archives