మొత్తానికి డైరక్టర్ తేజ మళ్లీ మ్యూజికల్ చైర్స్ ఆట ఆడారు. హీరో మళ్లీ మారారు. వెంకీ అన్నారు. ఆ తరువాత రానా అన్నారు. కాదు కాదు, బెల్లంకొండ రెండోకొడుకు లాంచింగ్ అన్నారు. ఆఖరికి బెల్లంకొండ శ్రీనివాస్ ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా అతి త్వరలో పట్టాలెక్కబోతోంది. అప్పుడే అనూప్ రూబెన్స్ తోమ్యూజిక్ సిటింగ్స్ పూర్తి చేసుకుని, రెండు ట్యూన్ లు ఫైనల్ చేసుకున్నారు.
చాలా కాలం తరువాత తేజ యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్ లో సినిమా చేయబోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఆరు ఫైట్లు వున్న కథ తయారు చేసారు. ఈ సినిమాకు హీరోయిన్ గా తనకు అచ్చివచ్చిన కాజల్ నే మళ్లీ తీసుకున్నారు.
చిత్రమేమిటంటే, కాజల్ ఇప్పటికే బెల్లంకొండతో ఓ కొత్త డైరక్టర్ సినిమాను చేస్తోంది. ఆ సినిమా తరువాతే ఈ సినిమా. దీంట్లోనూ కాజల్ నే హీరోయిన్. అంటే బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరోతో రెండు సినిమాలు అన్నమాట.
ఇంకా విశేషమేమిటంటే, ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించడం. రానా-తేజ కాంబినేషన్ లో సినిమా అని అనిల్ సుంకర ప్లాన్ చేసారు. ఈ లోగా రానా ఆరోగ్య సమస్యలతో, కాస్త విరామం తీసుకుంటున్నాడు. దీంతో ఆ ప్రాజెక్టు కాస్తా ఇటు వచ్చింది. ఇలా సెటిల్ అయింది.