జనసేన పుట్టిన దగ్గర నుంచి ఎవరు అందులోకి వెళ్తున్నారో, ఎవరికి అందులో పదవులు వున్నాయో అన్నదాని మీద క్లారిటీ లేదు. ఇటీవల మాత్రమే కాస్త ఒక పేరూ, మరో పేరూ అన్నట్లు బయటకు వస్తున్నాయి. జనసేన పార్టీ ఆడ్మిస్ట్రేషన్ లో ఎక్కువగా మాజీ ప్రజారాజ్యం జనాలే వున్నారన్న కామెంట్ వుంది. అది వేరే సంగతి.
పవన్ గతంలో ఒకటి రెండు సార్లు క్లియర్ గా చెప్పారు. పార్టీని నిజాయతీ, నిబద్దత కలవారితో నింపుతామని, మిగిలిన పార్టీలో కూడా మంచివారు వుంటే స్వాగతిస్తానని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే, నిజాయతీ నిబద్దత సంగతి అలా వుంచి మాజీలకు బాగానే చొటిస్తున్నట్లు కనిపిస్తోంది.
విశాఖలో ప్రజారాజ్యం మాజీ ప్రజా ప్రతినిధి చింతలపూడి వెంకటరామయ్య కు జనసేన ఆహ్వానం పలుకుతున్నట్లు విశాఖలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ మంత్రి కొణతాల అనునాయకులుగా పేరు పడిన గండి బాబ్జీ తదితరులు కూడా జనసేన బాట పడుతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే కొణతాల కూడా వస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే కాపులకు పెద్ద పీట వేస్తున్నట్లు కనిపిస్తున్న, పార్టీలో కొణతాల రామకృష్ణ ఇమడగలరా? అన్నది అనుమానమే.