కొత్తవాళ్లతో సినిమా చేయడం, తక్కువ బడ్జెట్ తో సినిమా చేయడం వంటి వాటికి డైరక్టర్ తేజ పెట్టింది పేరు. గతంలో చిత్రం మూవీస్ బ్యానర్ పై ఇలా సినిమాలు చేసి, హిట్ లు కొట్టాడు. డబ్బులు సంపాదించాడు. ఆ తరువాత ఆ బ్యానర్ కు కాస్త విరామం ఇచ్చాడు.
ఇప్పుడు లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ సినిమా కోసం కొత్త జనాలతో అడిషన్లు విపరీతంగా చేస్తున్నాడు. పనిలో పనిగా కొత్త టాలెంట్ ను పట్టుకునే ప్రయత్నంలో వున్నారు తేజ. వస్తున్న కొత్త టాలెంట్ ను చూస్తుంటే మళ్లీ చిత్రం మూవీస్ బ్యానర్ పై సినిమా చేయాలన్న ఆలోచన వచ్చినట్లుంది.
అయితే తను కాకుండా, దర్శకులుగా కూడా కొత్తవారిని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నట్లు వినికిడి. ఇలా ఆలోచనలు సాగుతున్న టైమ్ లో ఛలో సినిమాతో హిట్ కొట్టాడు డైరక్టర్ వెంకీ కుడుముల.
అందుకే అర్జెంట్ గా అతనికి కబురుచేసాడట. ఛలో విజయానికి అభినందించి, పనిలో పనిగా చిత్రం మూవీస్ బ్యానర్ పై సినిమా చేద్దామనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిసింది. వరుస ఆఫర్లతో తడిసి ముద్దవుతున్న వెంకీ కుడుమల అలాగే అని చెప్పి వచ్చినట్లు వినికిడి.