సైరా, ఎన్టీఆర్ బయోపిక్. ఈ రెండు సినిమాలు ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు నందమూరి బాలయ్యలకు ప్రెస్టీజియస్ సినిమాలు. సాధారణంగా ఇలా పెద్ద సినిమాల విషయాలు తెలుసుకోవడం అన్నది ఆసక్తికరంగా వుంటుంది సినిమా అభిమానులకు. అదే సమయంలో సినిమా విశేషాలు ఎప్పటికప్పుడు తెలియచేయడానికి పీఆర్వోలు వుంటారు.
అయితే ఈ రెండు సినిమాలకు ప్రత్యేకంగా పీఆర్వోలు అక్కర్లేదని ఇండస్ట్రీలో సరదా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు కామన్ గా పనిచేసే ఓ వ్యక్తి నుంచి మీడియాకు తరచు లీకులు అందుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఆ రెండు సినిమాలకు పనిచేసే ఓ కీలక వ్యక్తి తనకు హైప్ రావడం కోసం, మీడియాతో తన సత్సంబంధాలు కొనసాగడం కోసం తరచు ఆ రెండు సినిమాల విషయాలు లీక్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనివల్ల ఆ రెండు సినిమాలకు అనర్ధమే జరుగుతోంది. లీకులు అందిన వారు ఒకలా రాస్తుంటే, వాటికి మరిన్ని చిలవలు పలవలు కలిపి బయట చలామణీ అవుతున్నాయి. దీంతో ముఖ్యంగా సైరా విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇది సైరాకు కీడే చేస్తుంది కానీ మేలు కాదు. చిరంజీవి ఈ విషయంలో మేలుకుని, కాస్త లీకు వీరులను కట్టడి చేసుకోవడం అవసరం.