మహేశ్‌బాబు మళ్లీ వచ్చాడు. ఈసారి కూడా ఒక సామాజిక సమస్యను తన సినిమాలో చర్చించాడు. ఒక సామాజిక అంశాన్ని తన సినిమాలో ప్రస్తావించి కూడా తన అభిమానులను, మాస్‌ను ఆకట్టుకున్నాడని, కమర్షియల్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి మహేష్ హిట్టుకొట్టాడని.. ఇదొక బ్రహ్మాండమైన ఫార్ములా అని సినీ రివ్యూయర్లు పొగుడుతూ ఉన్నారు!
సినిమాలో రైతుల సమస్యల గురించి బాగా ప్రస్తావించారని, రైతుల డైలాగులు బాగా పెట్టారని.. ఒకటే ప్రశంసలు! మరి దీనికి అందరం అభినందిద్దాం! ఎలా అంటే..? మహేశ్‌బాబు సినిమాను సూపర్ హిట్ చేయడం ద్వారా. తొలిరోజు అయితే ఐదారు వందల రూపాయలు, ఆ తర్వాత అయితే రెండుమూడు వందల రూపాయలు పెట్టి టికెట్ కొని మహేష్ బాబు తాజా సినిమాను సూపర్ హిట్ చేసి.. అంతా అభినందించాలి!
దాంతో ఏమొస్తుంది? అంటే.. మహేష్ కలెక్షన్స్ స్టామినా పెరుగుతుంది! మహేష్‌బాబు సినిమా వంద కోట్ల రూపాయల పైస్థాయి వసూళ్లను సాధిస్తుంది. తన సహచర స్టార్ హీరోల్లో మహేష్ రేంజ్ పెరుగుతుంది. తద్వారా అతడి రెమ్యూనరేషన్ పెరుగుతుంది. ఆ సినిమా నిర్మాతలు భారీ లాభాలు సొంతం చేసుకుంటారు! మహేశ్ వీరాభిమానులు తమ హీరోకి ఇంకోసారి వేళ్లు కోసి రక్తతిలకం దిద్దుతారు! తెలుగుసినిమ రేంజ్ పెరిగిపోయిందని.. సినీ విశ్లేషకులు ఘనంగా విశ్లేషణలు రాస్తారు. తమిళంలో స్టార్ హీరోల సినిమాలను మించి మన స్టార్ హీరోలు తమ సినిమాలతో బాగా సొమ్ములు సంపాదించుకుంటున్నారని వీరు సంబరపడతారు!
ఇదీ.. ఒక 'సామాజిక అంశం'తో మిళితమైన కమర్షియల్ సినిమా ద్వారా 'సమాజానికి' ఒనగూరే ప్రయోజనం! 'మహర్షి' సినిమాలో వ్యవసాయం గురించి చూపించారని, రైతులు, రైతుబిడ్డలు ఈ సినిమాను చూసేయాలని.. చూసి గర్వించేయాలని సోషల్ మీడియాలో కొంతమంది చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. మీరు అంతగా రైతు బిడ్డలైతే, రైతులను ఉద్ధరించేందుకు ఏదైనా చేయండి. రైతుల కోసం పాటు పడండి. అంతేకానీ.. మల్టీప్లెక్స్ కు వెళ్లి ఒక సినిమాను చూడటం రైతులను ఉద్ధరించడం ఎలా అవుతుందో సదరు మేధావులకే తెలియాలి!
సినిమాల్లో మన హీరోల మంచితనం మామూలుగా ఉండదు. వారు సినిమాల్లో ఉద్యమకారులు. ప్రజా నాయకులు, ప్రజల కష్టాలను అర్థం చేసుకునేవాళ్లు, నల్లధనాన్ని బయటకు లాగేవాళ్లు! ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో! వాళ్లు సినిమాల్లోనే సమాజాన్ని ఉద్ధరించేస్తారు. సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసరికి సమాజం అంతా మారిపోతుంది. ఎన్నో సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఈ విషయంలో వారు చొచ్చుకు వచ్చేస్తున్నారు!
మహేశ్‌బాబునే తీసుకుంటే.. 'భరత్ అనే నేను' సినిమాతో అతడు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేశాడు, 'మహర్షి'తో రైతుల జీవితాలను మార్చేశాడు! ఇంతకన్నా ఏం కావాలి? ఇక్కడ మహేశ్ గురించి మాత్రమే చెప్పడంలేదు. మన హీరోలంతా హీరోలే! అందరూ అందరే. వీళ్లు సినిమాల్లో సమస్యలను పరిష్కరించేస్తారు. తమ ఫామ్‌హౌస్‌లలో కూర్చుని పుస్తకాలు తిరగేస్తారు. అక్కడ మేధస్సును సంపాదించేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తారు. పార్టీలు పెడతారు. ఓట్లు అడుగుతారు! తమను ముఖ్యమంత్రిని చేసేస్తే సినిమాల్లో వ్యవస్థను బాగు చేసినట్టుగా బాగు చేసేస్తామని కథలు చెబుతారు. ఎన్నికలు కాగానే అంతే సంగతులు, ఆ తర్వాత మళ్లీ సినిమాలు మళ్లీ ఎన్నికలు వస్తే రాజకీయాలు!
సినిమాల్లో కార్పొరేట్ వ్యవస్థను బ్రహ్మాండంగా ఎండగట్టేసే హీరోలు.. బయటకు వస్తే అదే కార్పొరేట్ వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు! ఖరీదైన విస్కీ కంపెనీలకు, కూల్‌డ్రింక్ బ్రాండ్లకు, సూట్లకు, బూట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరహించీ హీరో సినిమాలో మాత్రం కమ్యూనిస్టు పలుకులు పలికితే వినడానికి అంతకన్నా బూతులు ఏముంటాయి? జనాలు మైకంలోనే ఉండిపోయినంత వరకూ ఇలానే ఉంటుంది పరిస్థితి!
వీళ్ల ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ రికార్డులు సరిగా ఉండవు, పన్నులు ఎగ్గొట్టారనే ఆరోపణలు వీళ్ల మీద వస్తుంటాయి.. వీళ్లేమో నల్లధనం గురించి మట్లాడతారు! 'నల్లధనం' కాన్సెప్ట్ మీద పదిపన్నెండేళ్ల కిందట వచ్చిన 'శివాజీ' సినిమా విషయంలో రజనీకాంత్ ఎంత పారితోషకం తీసుకున్నాడు, ఆ సినిమా బడ్జెట్ ఎంత, దాని వసూళ్లు ఎన్ని అనే విషయాల గురించి క్లారిటీ ఇవ్వగలిగారా? ఆ ఒక్క సినిమా అనేకాదు.. నీతులు చెప్పిన ఏ స్టార్ హీరో సినిమా విషయంలో అయినా వాస్తవాలను బయటపెట్టగలిగారా?
ఇక్కడ స్పష్టం అవుతున్న విషయం ఏమిటంలే.. నీతులు చెప్పడం కూడా ఒక మార్కెటింట్ స్ట్రాటజీ! ఒకరేమో తమ సినిమాను అమ్ముకునేందుకు, కోట్ల రూపాయలను గడించేందుకు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారు. తెరమీదేమో కమ్యూనిస్టులా కనిపిస్తూ, తెరవెనుక కార్పొరేట్ గిరికి వీళ్లు సలామ్ చేస్తూ ఉంటారు. మరికొందరు సినీ అభిమానాన్ని రాజకీయ అభిమానంగా మార్చుకుని.. ఓట్లు, సీట్లను బేరంగా మార్చి కోట్లు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమ అహం కోసం తమ అభిమానగణాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒక్కోరిది ఒక్కో రూటు. ఇక్కడ ఏ హీరోనీ నిందించడం లేదు. జనాలు గమనించాల్సిన అంశాలు ఇవి అని చెప్పడం జరుగుతూ ఉంది!
చిన్నమార్పు అయినా తీసుకురాలేరా?
సమాజంలో నీకంటూ పేరుంది. నీకంటూ అభిమానులున్నారు. నీకంటూ ఒక శక్తి ఉంది. సినిమాలో నువ్వో సూపర్ పవర్‌గా వెలుగొందుతావు. పాట అయిపోయే లోపు సమాజాన్ని మార్చేస్తావు. ఆ ఇమేజ్‌తో నిజ జీవితంలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతావు!
మరి నువ్వు వ్యక్తిగతంగా ఉద్ధరిస్తున్నది ఏమిటి? అనేది ఇక్కడ ప్రశ్న. అలాంటి ఇమేజ్‌తో కోట్లు గడిస్తావు. దాన్ని కూడా తప్పుపట్టం. మరి ఆ డబ్బు నీకు ఎక్కడ నుంచి వస్తోంది? రాళ్లు కొట్టి సంపాదించలేదు కదా. నీకున్న మాధ్యమం ద్వారా నీతులు చెప్పడం కాకుండా, నిజంగా ప్రజల కోసం ఏమీ చేయలేవా? 'వట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్' అన్నాడు ఒక మహాకవి. మరి సినిమా వాళ్లు ఎంతసేపూ వట్టిమాటలు చెప్పి డబ్బులు మూటలు గట్టుకోవడమేనా? వీళ్ల సినిమాల ద్వారా వచ్చే మార్పు ఆ సినిమాల క్లైమాక్స్‌లో చూపించింది మాత్రమేనా? వాస్తవంలో ఏమీ ఉండదా? వీళ్లను వీరలెవల్లో అభిమానించే వారు అయినా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేరా?
పక్కనున్న తమిళనాడు సినిమా వాళ్లను అయినా చూడండి. ప్రతి తమిళ సినిమాకూ తెగే ప్రతి టికెట్ మీదా ఒక్క రూపాయిని రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్నారు. కనీసం ఆ చిన్నపాటి చర్య కూడా తెలుగు సినిమా నుంచి లేకపోవడం నిజంగా హేయం! రైతుల పేరుతో, వ్యవసాయం పేరుతో సినిమాలు తీసి.. అలా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ, నిజంగా రైతుల కోసమో, వ్యవసాయం కోసమో ఆలోచించే హీరో ఒక్కడూ లేడిక్కడ! వీళ్లంతా తెరమీద మాత్రమే హీరోలు. వాస్తవంలో కాదు.
ఒక రూపాయి కాదు. ప్రతి టికెట్ మీదా ఐదు రూపాయలు ఇచ్చినా తప్పులేదు. అది కూడా ప్రేక్షకుల మీదే భారంగా వేసి అయినా ఒక నిధిని ఏర్పాటు చేసి, రైతులకు సాయంగా నిలిస్తే అప్పుడు కదా వీళ్లు హీరోలు అయ్యేది? తమ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని, తమ హీరో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని, ఐటమ్ గర్ల్ తక్కువ బట్టలు వేసుకుందని.. సినిమా టికెట్ రేటును పెంచాలనే కోరుతూ మీడియాకు ఎక్కి వాపోతున్న వీళ్లు సమాజాన్ని ఉద్ధరిస్తారని అనుకోవడమే పెద్ద భ్రమ. వీళ్ల నుంచి అది ఆశించడం కూడా వ్యర్థమే.
వీళ్ల సినిమాలు రొడ్డకొట్టుడు. కొత్తదనం చూపి వీళ్లు ఏదో ఇండియా స్థాయిని పెంచేదీ ఉండదు. తమ స్వార్థంకోసమే తప్ప సమాజం కోసం ఆలోచించేంత హితమూ వీరికి లేదు! నీతులను కూడా మార్కెటింగ్ టెక్నిక్‌గా మార్చుకుని అమ్ముకుంటున్నారు. సినిమాలు బోర్ కొట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. వెర్రి అభిమానులనున్నారని అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు! ఇదీ తెలుగు సినిమా పరిశ్రమ!