జనసేనపై జనంలో రసవత్తర చర్చ
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన వెంటనే 2019 ఎన్నికలను ఎదుర్కొన్న ప్రముఖనటుడు చిరంజీవి కనీసం ఎన్నికల ఫలితాల వరకైనా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించారు. గుప్పిట్లో రహస్యాన్ని దాచగలిగారు. జనం విపరీతమైన అంచనాలతో ఉండేలా చేయగలిగారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా ప్రరాపాపై ప్రజల్లో చర్చ జరిగింది. అప్పట్లో ఫలితాలు వెల్లడయ్యే వరకూ ప్రజారాజ్యం అధికారంలోకి రావడం తథ్యమని
అనేకమంది నమ్మారు. చిరంజీవే ముఖ్యమంత్రి అవుతారని, ఈ విషయంలో ఏ విధమైన సందేహం అవసరం లేదంటూ ఆ పార్టీ నేతలు సహా ఇతర పార్టీల నేతలూ వాదించారు. తీరా ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే భ్రమలన్నీ తొలగిపోయాయి. అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం జెండా పీకేయాల్సి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం (యువరాజ్యం) అధ్యక్షుడిగా ప్రస్తుత జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పనిచేశారు.
కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం కావడం, చిరంజీవి కేంద్రమంత్రి కావడం వంటి పరిణామాలు అప్పట్లో కలకలం రేపాయి. ఐదేళ్ళ అనంతరం 2014లో ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. ప్రముఖ సినీనటుడిగా వెలుగుతున్న పవన్ రాజకీయాల్లో చక్రంతిప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో దిగకుండా కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో చంద్రబాబుకూ మద్దతు పలికారు. బీజేపీ-టీడీపీ విజయానికై స్వయంగా ప్రచారం చేశారు. 2014 ఫలితాలనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం తమ నాయకుడి సహకారంతోనే అధికారంలోకి వచ్చిందని జనసైనికులు అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు.
ఇక 2019 ఎన్నికల నాటికి అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. చంద్రబాబు నాలుగేళ్ళ పాటు బీజేపీతో అంటకాగి అనక తెగతెంపులు చేసుకున్నారు. ఇదే సమయంలో పవన్‌కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగారు. జనసేన ఎవరితోనూ పొత్తుపెట్టుకోకుండా స్వతంత్రంగా ఎన్నికల గోదాలోకి దిగుతుందని ప్రకటించారు. పవన్ చెప్పినట్టే జనసేన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. మరోవైపు చంద్రబాబు, జగన్‌లు ఎన్నికల సమరంలో నువ్వా? నేనా? అన్నట్టు తలపడ్డారు. ఈదఫా ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేన ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతుందని ఎదురుచూసిన ఆయావర్గాలు చివరకు ఆ పార్టీ పరిస్థితిని చూసి ముక్కున వేలేసుకున్నాయి. పవన్ రాజకీయ అరంగేట్రంపై ఆయావర్గాలు ఆసక్తి కనబరచినప్పటికీ ఆయన స్థాపించిన జనసేన పార్టీపై మాత్రం అతిగా అంచనాలు వేసుకోకపోవడం, ఎక్కువగా ఊహించుకోకపోవడం గమనార్హం!
జనసేనపై ఈ ఎన్నికల్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేవని తేలిపోయింది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే చిరంజీవి ప్రజారాజ్యం బ్యానర్‌పై జనంలోకి వెళ్ళి విపరీతమైన హైప్ క్రియేట్ చేయగలిగారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో సమానమైన మీడియా ప్రచారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో త్రిముఖపోరు నడిచినట్టు (తెలుగుదేశం, కాంగ్రెస్, పీఆర్‌పీ) జనం చెప్పుకున్నారు. ప్రజారాజ్యం అధికారంలోకి రావడం, చిరు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆ పార్టీనేతలు సహా వివిధ వర్గాల ప్రజలు ఊహించుకునే రేంజ్‌కు పార్టీని తీసుకువెళ్ళగలిగారు. ఎన్నికల ఫలితాలనంతరం గాని పరాజయం బయటపడకుండా గుప్పిట్లో రహస్యాన్ని దాచగలిగారు.
పవన్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడికాకముందే జనసేనపై జనానికి ఓ క్లారిటీ రావడం ఆ పార్టీకి దురదృష్టకర పరిణామమే! ఆ మాటకొస్తే త్రిముఖపోటీ అనేమాటే కనిపించకపోవడం, కేవలం తెలుగుదేశం-వైకాపా మధ్య మాత్రమే పోటీనడిచినట్టు జనం డిసైడ్ కావడం జనసేనకు ఆశనిపాతంగా మారింది. కనీసం ఎన్నికల ఫలితాల వరకైనా జనసేనపై జనానికి అంచనాలంటూ లేకపోవడం గమనార్హం! పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా విడుదలైతే జనానికి ఓ అంచనా అంటూ ఉంటుంది.
రాజకీయాలపై ఎన్నో ఆశలు పెట్టుకుని జనసేన పార్టీని స్థాపించి 2019 ఎన్నికలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నికల ఫలితాలపై ఆయన అభిమానుల్లో సైతం కనీస స్థాయిలో అంచనాలు లేకపోవడం బాధకరంగా చెప్పుకోవచ్చు! కర్ణుడి చావుకు కారణాలు సవాలక్ష అన్నట్టు పవన్ పార్టీకి ఈ దుస్థితి దాపురించేందుకు వెను అనేక కారణాలున్నాయి. జనసేనకు ఓట్లు బాగానే లభిస్తాయని, సీట్లు మాత్రం ఆశించిన స్థాయిలో లభించే అవకాశాల్లేవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.