ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నం అవుతూ ఉంది. ఫలితాల విషయంలో అంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. మరికొందరు మాత్రం ఫలితాలపై స్పష్టత వచ్చినట్టే అని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉండవచ్చు అనే అంచనాలున్నాయి. ప్రీపోల్ సర్వేలు అదేమాట చెప్పాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి.
ప్రీపోల్ సర్వేల్లో జాతీయ మీడియా వర్గాలు కూడా అదేమాటే చెప్పాయి. ఎంపీ సీట్ల వారీగా జాతీయ మీడియా వర్గాలు వెలువరించిన అధ్యయనాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అవి పట్టంకట్టాయి. పోస్ట్‌పోల్ విశ్లేషణల్లో కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. జగన్ పార్టీ విజయం ఖరారు అయిపోయినట్టే అని, జగన్ కేబినెట్ ఎలా ఉండబోతోంది.. అనే అంశమే ఇప్పుడు చర్చించుకోవాలన్నట్టుగా కొన్ని విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి. మరి ఆ అంశం గురించినే ఇప్పుడు విశ్లేషిస్తే జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్‌ను ఏర్పాటుచేసే పరిస్థితుల్లో ఎవరికి ప్రాధాన్యతను ఇస్తారు? అనేది ఆసక్తిదాయకమైన అంశం.
ఫలితాలు వచ్చిన రెండు మూడురోజుల్లోనే ప్రభుత్వ ఏర్పాటుకు జగన్ సమాయత్తం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జగన్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే అంశం గురించి ఆసక్తిదాయకమైన చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో జగన్ జూనియర్లకు అవకాశాలు ఇస్తారా? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా? అనే అంశం మరింత ఆసక్తిదాయకంగా మారింది. రాయలసీమలో జగన్ ఎవరికి ప్రాధాన్యతను ఇస్తారు? ఎవరిని తన కేబినెట్లో చేర్చుకుంటారనే అంశంపై చర్చసాగుతూ ఉంది. మంత్రి పదవుల పోటీ విషయంలో యథారీతిన సీనియర్లు పోటీలో ఉన్నారు. కొందరు అనూహ్యంగా మంత్రి పదవులను ఆశిస్తూ ఉన్నారు.
ముందుగా అనంతపురం జిల్లా నుంచి మొదలుపెడితే అక్కడ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి వంటి యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్లు మంత్రి పదవులను ఆశిస్తూ ఉన్నారు. పరిటాల కోటను ప్రకాష్ రెడ్డి ఈసారి బద్దలుకొడితే ఆయన మంత్రి పదవికి సంపూర్ణంగా అర్హుడవుతారు. దళిత-మహిళ కోటాలో జొన్నలగడ్డ పద్మావతికి అవకాశం ఉంది. ఇక ఇదే జిల్లా నుంచి సీనియర్ నేత అనంతవెంకట్రామిరెడ్డి మంత్రిపదవిని ఆశిస్తున్నారు. అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గితే ఆయన మంత్రిపదవి కోసం పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఉరవకొండ నుంచి గెలిచివస్తే విశ్వేశ్వరరెడ్డి కూడా పోటీదారుడే అవుతారు.
కర్నూలుజిల్లాలో కూడా పోటీ గట్టిగానే ఉంది. అక్కడ కొందరు సీనియర్లు, మరి కొందరు జగన్‌కు సన్నిహితులుగా పేరున్నవారు మంత్రి పదవుల కోసం పోటీలో ఉన్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వంటి వారితో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా ఈ విషయంలో వినిపిస్తూ ఉంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అనే అంటున్నారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా చేసి జగన్ వెంట నడిచిన వారిలో పెద్దిరెడ్డి ఉన్నారు. కాబట్టి ఆయనకు అవకాశం ఉండనే ఉంటుంది. రెండో బెర్త్ పేరు విషయంలో ఆర్కే రోజా పేరు వినిపిస్తూ ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చి, రోజా ఎమ్మెల్యేగా నెగ్గితే ఆమెకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గురి టీటీడీ చైర్మన్ పదవి మీదే ఉందని సమాచారం.
జగన్ సొంతజిల్లాలో కూడా ఈసారి పోటీగట్టిగా ఉంది. శ్రీకాంత్ రెడ్డి మంత్రిపదవిని ఆశిస్తూ ఉన్నారు. రాజంపేట అభ్యర్థి మేడా మల్లిఖార్జున రెడ్డి కూడా ఆ ఆశలతో ఉన్నారని సమాచారం. మైనారిటీల కోటాలో కడప ఎమ్మెల్యేకు మంత్రిపదవి దక్కవచ్చని అంచనా. స్థూలంగా నాలుగు జిల్లాల నుంచి కనీసం పదిమంది ఆశావహులు కనిపిస్తూ ఉన్నారు. ఐదారుగురుకు అయితే మంత్రి పదవులు కచ్చితంగా దక్కే అవకాశం ఉంది. వారెవరో అనేది తేలాలంటే.. ముందుగా ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలి!