Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగింటి ఆడబిడ్డ శ్రీదేవి

తెలుగింటి ఆడబిడ్డ శ్రీదేవి

అవును శ్రీదేవిని ఏ తెలుగు ఇల్లూ అంత త్వరగా మరచిపోలేదు. 1994తరువాత అంటే పాతికేళ్ల క్రితమే శ్రీదేవి తెలుగు తెరపై పెద్దగా కనిపించడం మానేసింది. అయినా ఏ తెలుగు సినిమా ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. ఎందరు హీరోయిన్లు వచ్చినా, తెలుగు ప్రేక్షకుల ముందు ఎన్ని వయ్యారాలు ఆరబోసినా, ఇంకా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో శ్రీదేవి జ్ఞాపకాలు పదిలంగానే వున్నాయి.

ఎంతమంది హీరోయిన్లను చూసి వుంటాడు రామ్ గోపాల్ వర్మ.. అయినా శ్రీదేవినే కలవరిస్తాడు. అతగాడికీ శ్రీదేవే ఆరాధ్యదేవత. అదేకదా ఆ అతిలోక సుందరి చేసిన చిత్రం.

ఎవరున్నారు తెలుగులో బాలనటిగా మనవరాలిగా నటించేసి, పెద్దయ్యాక మళ్లీ వాళ్లతోనే హీరోయిన్ గా మెప్పించేసి. అంతటితో ఆగకుండా వాళ్ల పిల్లల సరసన కూడా హీరోయిన్ గా చేసి. ఇలాంటి సుదీర్ఘమైన కెరియర్ శ్రీదేవి స్వంతం. నిన్నా.. మొన్నా.. అటు మొన్నా కాదు. 1969లో ప్రారంభించింది మొహానికి రంగేసుకోవడం. ఇప్పటికీ అడపదడపా అది కొనసాగుతూనే వుంది. అంటే దాదాపు యాభై ఏళ్ల కెరియర్ అన్నమాట. ఆ లెక్కన చూస్తే శ్రీదేవి కన్నా సీనియర్ నటి మాత్రమే కాదు, నటులు వున్నారా? అని అంటే కాస్త గూగుల్ ను కెలకాల్సిందే.

తెలుగుతెరపై ఎన్ని చిలకపలుకులు పలికింది. ఎన్ని వొయ్యారాలు వొలకించింది. అమ్మ బ్రహ్మదేవుడో.. కొంప ముంచినావురో.. అని ప్రేక్షకుల చేత అనిపించింది. పదహారేళ్ల వయసు పరువంలో పైట ఎగరేసింది. ఎన్ని వానపాటల్లో పచ్చిపాల సొగసు ఆరబోసింది. ఇదంతా గ్లామర్ కోణం. నటనలో కూడా శ్రీదేవి సిరిదేవే.

వసంత కోకిలలో ‘సుబ్రహ్మణ్యం’ అంటూ తిరిగే అమాయకపు పిచ్చిపిల్లను అంత సులువుగా మర్చిపోగలమా? దేవత సినిమాలో పండించి, గుండెలు పిండిన సెంటిమెంట్ ను మరచిపోగలమా? క్షణక్షణం సినిమాలో కుమ్మరించిన కామెడీని వదిలేయగలమా? అతిలోకసుందరిగా కురిపించిన హాస్యాన్ని తలుచుకోమా? ఆకలిరాజ్యంలో ఓ మధ్యతరగతి అమ్మాయిగా ప్రదర్శించిన ప్రతిభను గుర్తు తెచ్చుకోమా? ఇలా ఒకటేమిటి?

అన్ని విధాలా శ్రీదేవి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని వెండితెర కథానాయిక. సావిత్రి, అంజలి, కృష్ణకుమారి, జమున తదితరులు ఒక తరానికే పరిచయం. జయసుధ, జయప్రద కూడా అంతే. కానీ శ్రీదేవి అలా కాదు. కొన్ని తరాలకు పరిచయం. మొన్నటికి.. నిన్నటికి.. నేటికి కూడా గుర్తుండిపోయిన తార. తమిళనాట పుట్టినా తెలుగింటికి దత్తతకు వచ్చిన ఆడబిడ్డ. బాలీవుడ్ ను మెట్టినిల్లు చేసుకున్నా, తెలుగింట ఆ ఆడబిడ్డ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?