‘టెంపర్’ సినిమా నిర్మాణంలో బండ్ల గణేష్‌కి ఇబ్బందులు ఎదురైనప్పుడు అతనికి సచిన్ జోషి సాయం చేసాడనేది అప్పుడే లీకయింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అయిన సచిన్ జోషితో గణేష్‌కి సాన్నిహిత్యం బాగానే ఉంది. అతని ‘నీ జతగా నేనుండాలి’ చిత్రానికి గణేష్ ఇక్కడ నిర్మాణ సారధ్యం వహించాడు. ఆ పరిచయం కొద్దీ టెంపర్ చిత్రం షూటింగ్ ఆగిపోయినప్పుడు సచిన్ గట్టెక్కించినట్టున్నాడు.
అయితే మరి బండ్ల గణేష్‌తో టర్మ్స్ ఏం మాట్లాడుకున్నాడనేది తెలీదు కానీ ‘టెంపర్’కి తాను కూడా ఒక నిర్మాతనని సచిన్ అంటున్నాడు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ వ్యవహారాన్ని కూడా సచిన్ జోషి చూస్తున్నాడు. అంతటితో ఆగట్లేదు… టెంపర్ కలెక్షన్స్ వివరాలు కూడా సచిన్ ప్రకటిస్తున్నాడు. ఇంతవరకు ఈ చిత్రానికి 42 కోట్ల రికవరీ జరిగిందని, మొత్తంగా అరవై కోట్ల వరకు వస్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు.
అతను చెప్పిన కలెక్షన్ వివరాలు షేరా, గ్రాసా, నెట్టా అన్నది పేర్కొనలేదు. లేదా శాటిలైట్ రైట్స్ అమ్మేసారు కాబట్టి అది కానీ కలెక్షన్లకి కలిపి చెప్తున్నాడా అనే సంగతి ప్రకటించలేదు. అయితే సాక్షాత్తూ నిర్మాతల్లో ఒకడే చెప్తున్నాడు కాబట్టి ఇదే నిజమని ఎన్టీఆర్ అభిమానులు ‘టెంపర్’ అరవై కోట్ల సినిమా అనేస్తున్నారు. సచిన్ జోషి హడావిడి వల్ల టెంపర్ వసూళ్ల గురించి నేషనల్ మీడియాలో కూడా న్యూస్ వచ్చేసింది.
కానీ అసలు సంగతేంటంటే… థియేట్రికల్ షేర్ పరంగా తొలి వారంలో టెంపర్‌కి 34 కోట్లు వచ్చినట్టు అంచనా. అంటే జరిగిన బిజినెస్ ప్రకారం మరో తొమ్మిది కోట్ల వరకు రికవర్ అయితే తప్ప బయ్యర్లకి సేఫ్ సినిమా కాదు. కాబట్టి టెంపర్‌కి ఈ వీకెండ్ పర్ఫార్మెన్స్ చాలా కీలకం.