మొదటి దానికి మొగుడు లేడు కానీ అన్న సామెత గుర్తు చేస్తున్నట్లు వుంది హీరో నిఖిల్ వ్యవహారం. దాదాపు రెండేళ్ల నుంచి బాహుబలి మాదిరిగా చెక్కుతున్నారు అర్జున్ సురవరం సినిమాను. అది విడుదల చేసే ప్రయత్నాలు చేయకుండా, కార్తికేయ 2 అంటూ సినిమా ప్రకటించారు.
నిజానికి నిఖిల్ బర్త్ డే అని ఏదో ఒకటి ప్రకటించాలని ఫ్రకటించినట్లు వుంది కానీ, కార్తికేయ 2 వ్యవహారం కూడా పురానా జమానా నుంచి వార్తల్లో నానుతోంది. పాతిక కోట్ల బడ్జెట్ నుంచి ఇరవై కోట్లకు, అలా పదిహేను కోట్లకు దిగుతూ వస్తోంది. నిఖిల్ మార్కెట్ కు, ఆ సినిమా బడ్జెట్ కు పొంతన కుదరడం లేదని బోగట్టా.
ఆఖరికి ఇప్పటికి పీపుల్స్ మీడియా, ఇంకా చాలామంది కలిసి, 15 కోట్ల ప్యాకేజ్ తో సినిమాను ఫిక్స్ చేసారు. కానీ చందు మొండేటి స్క్రిప్ట్ వర్క్ ఇంకా చేయాల్సి వుంది. ఈలోగా చేయాల్సిన శ్వాస సినిమా క్యాన్సిల్ అయింది. అంటే ఇప్పటికిప్పుడు అర్జున్ సురవరం విడుదలైనా, కార్తికేయ 2 విడుదల లోపు అంటే వచ్చే ఏడాది జనవరి తరువాత వరకు మధ్యలో సినిమా అన్నది లేదు.
ఎక్కడో ప్లానింగ్ లో తేడా కొట్టేసింది నిఖిల్ సినిమాల వరుసకు. ఓ పక్క కార్తికేయ 2 అంటూనే దర్శకుడు చందు మొండేటి ఇంకోపక్క శర్వానంద్ సినిమా కోసం ట్రయ్ చేస్తున్నారని గ్యాసిప్ లు వున్నాయి. కార్తికేయ 2 అయినా చకచకా ఫినిష్ చేసి, డిసెంబర్ నాటికి బరిలోకి తెస్తే బాగుంటుందేమో? ఎందుకంటే వచ్చే సంక్రాంతికి నాలుగు అయిదు సినిమాలు వస్తున్నాయి. అందువల్ల ఫిబ్రవరి వరకు మళ్లీ డేట్ లు దొరకడం కష్టం అవుతుంది.