జగన్మోహన్ రెడ్డికి అనన్యమైన ప్రజాదరణ లభించింది. సాధించిన సీట్ల సంఖ్యను గమనించినప్పుడు.. ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేనే లేదు. అయితే ఈ అనన్యమైన బలానికి మరో ప్రబల తార్కాణం ఏంటంటే… జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగురాష్ట్రం తమిళనాడులోని డీఎంకే అధినేత స్టాలిన్ స్వయంగా రావడం… జగన్ ను ప్రస్తుతిస్తూ ప్రసంగించడం!
అవును ఇది నిజంగానే అరుదైన విషయం. ఎందుకంటే- డీఎంకే అనేది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో జట్టుకట్టి రాజకీయం చేస్తున్న ద్రవిడ ప్రాంతీయ పార్టీ. చాన్నాళ్లుగా కాంగ్రెస్ తో వారి మైత్రీ బంధం కొనసాగుతూ వస్తోంది. ప్రత్యేకించి ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కూడా రాహుల్ పల్లకీకి బోయీగా మారిన తర్వాత.. డీఎంకే చంద్రబాబుతో సన్నిహితంగానే ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ కేంద్రంలో దారుణంగా దెబ్బతిన్న యూపీఏ కూటమి బంధాలు పటాపంచలు అయిపోయేలా.. స్టాలిన్ జగన్ ప్రమాణానికి హాజరై, ఆయనకు తన మద్దతు ప్రకటించారు.
ఈ పరిణామాల్ని గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ ముందే పసిగట్టింది. ‘జగన్ తో టచ్ లోకి డీఎంకే-స్టాలిన్!?’ అనే శీర్షికతో మే 15వ తేదీన ఓ కథనాన్ని అందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో సహా తమిళనాడు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన సందర్భంలో స్టాలిన్ ను కలిశారు. ఏపీలో జగన్ గెలవబోతున్నట్లుగా చెప్పారు. ఆ వెంటనే… స్టాలిన్ దూతగా దొరై మురుగన్ అమరావతి వచ్చి చంద్రబాబును కలిశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించి వెళ్లారు. జగన్ విజయంపై అప్పుడే ఒక అభిప్రాయానికి వచ్చి, జగన్ తో మైత్రీ బంధానికి సిద్ధపడినట్లుగా ఇప్పుడు అర్థమవుతోంది.
స్టాలిన్ దూత రాగానే… ‘‘డీఎంకేతో కలిసి మేం కేంద్ర రాజకీయాల్ని శాసించబోతున్నాం’’ అంటూ చంద్రబాబు గప్పాలు కొట్టారు. కానీ వాస్తవానికి స్టాలిన్- చంద్రబాబు ఓటమి గురించి నిర్ధరించుకున్న తర్వాత.. గ్రేటాంధ్ర ముందే అందించిన వార్తా కథనంలో మాదిరిగానే జగన్ తో మైత్రికి ప్రయత్నించారని… వారి బంధం మరింతగా బలపడిందని ఇప్పుడు అర్థమవుతోంది. కేసీఆర్, జగన్, స్టాలిన్ లు కలిస్తే దక్షిణాది పార్టీల ఐక్యతకు నిదర్శనంగా కేంద్రం నుంచి పనులు చక్కబెట్టుకోవడానికి మార్గం సుగమం అవుతుందని భావించవచ్చు.