రామోజీ స్పెషల్ క్లాస్ : ముందే నా వింటేనా?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు- రాజగురువు రామోజీరావు స్పెషల్ క్లాస్ తీసుకున్నారట. దారుణమైన ఓటమి తర్వాత.. పరిస్థితులు మొత్తం చంద్రబాబునాయుడుకు ఎదురు తిరిగిన నేపథ్యంలో అమరావతిలో మొహం చెల్లక హైదరాబాదుకు, దేశంలోనే మొహం…

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు- రాజగురువు రామోజీరావు స్పెషల్ క్లాస్ తీసుకున్నారట. దారుణమైన ఓటమి తర్వాత.. పరిస్థితులు మొత్తం చంద్రబాబునాయుడుకు ఎదురు తిరిగిన నేపథ్యంలో అమరావతిలో మొహం చెల్లక హైదరాబాదుకు, దేశంలోనే మొహం చెల్లక విదేశాలకు టూరుగా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న చంద్రబాబుకు… తనమాట ముందే విని ఉండాల్సిందని- ఇప్పుడు ఉన్నంత ఘోరమైమైన పరిస్థితి కాకుండా.. కాస్త సేఫ్ జోన్ లో ఉండి ఉండవచ్చునని రామోజీరావు హితబోధ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడడానికి పూర్వమే.. కాస్త భాజపా లేదా మోడీ అనుకూల పోకడలను ప్రదర్శించి ఉంటే బాబు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని రాజగురువు అన్నట్లుగా సమాచారం. ఎన్నికల ఫలితాలకు వారంరోజుల ముందు చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా హెలికాప్టర్ లో రామోజీ ఫిలింసిటీకి వచ్చారు. రామోజీ ఇంటిలో విందు భేటీ జరిగింది. ఫలితాలకు వారం ముందు జరిగిన ఈ కీలకమైన భేటీలో మంత్రాంగం ఏమిటో.. ఆనాడే గ్రేట్ ఆంధ్ర విశ్వసనీయ సమాచారాన్ని పాఠకులకు అందించింది.

‘రామోజీ బోధ : భాజపాకు జైకొడితే బెటర్!’ అనే శీర్షికతో ఆ కథనాన్ని అందించడం జరిగింది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మోదీ మీద నిందలు వేస్తూ ఎన్డీయే నుంచి చంద్రబాబునాయుడు తప్పుకున్న తర్వాత.. పరిస్థితులు ఏమీ చేతుల్లో లేకుండాపోయిన నేపథ్యంలో వాతావరణం సానుకూలంగా మారడానికి ఇది అవసరం అని రాజగురువు భావించినట్లు భోగట్టా.

చంద్రబాబునాయుడు మీద కీలకమైన కేసులు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. ఓటుకు నోటు సహా ఏ కేసును తిరగతోడడం జరిగినా ఆయన జైలుపాలయ్యే దుస్థితి ఉంది. పైగా అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా అనేక వ్యవహారాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. వాటిలో దేనిని బయటకు తీసినా చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని… రాజకీయవర్గాల్లో ఒక ప్రచారం ఉంది.

పరిస్థితులన్నీ ఇలా ప్రతికూలంగా ఉండగా.. ఎన్నికల్లో గెలిచే సూచనలేదు గనుక… జైలుపాలు కాకుండా ఉండాలంటే… ఫలితాలకు ముందుగానే మోదీ అనుకూల పోకడ ప్రదర్శించాలని రామోజీరావు, మే 15న జరిగిన విందుభేటీలో సూచించారని సమాచారం. అయితే చంద్రబాబుకు అది చెవికెక్కలేదు. ఏడాదిగా మోదీని ఎడాపెడా తిట్టి ఇప్పుడు మాట మారిస్తే ప్రజలు ఛీకొడతారని భావించి ఆయన మిన్నకుండిపోయి ఉండవచ్చు.

అయితే.. ఇప్పుడు ఓటమి ఖరారయ్యాక, కేంద్రంలో మోదీ మరింత బలవంతుడిగా లెక్కతేలిన తర్వాత… రామోజీరావు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. నా మాట ముందే వినిఉంటే.. ఎంతోకొంత బెటర్ గా ఉండేది కదా.. అని ఆయన క్లాస్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉత్తరాంధ్రలో వైసీపీని అక్కున చేర్చుకోవడానికి కారణమేంటి?