ఎన్నికల పర్వం ముగిసింది. కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల బలాబలాలు ఏమిటో, ఎంతమాత్రమో తేలిపోయాయి. రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా మనగలిగే పార్టీలు ఏమిటో, పురిట్లోనే సంధికొట్టిన పార్టీలు ఏమిటో కూడా లెక్క తేలిపోయింది. ఇక మిగిలినదెల్లా రాజకీయ బలాబలాల పునరేకీకరణలు మాత్రమే. అందుకే… ముందు ముందు కూడా రాజకీయాల్లో తమ భవిష్యత్తును కోరుకుంటున్న వారు… ఫ్యానుగాలికోసం తహతహలాడుతున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
ఈ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా భంగపడింది… జనసేనను నమ్ముకున్న వాళ్లే కావడం విశేషం. పవన్ కల్యాణ్ కు ఉండగల క్రేజ్ ను నమ్ముకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తతరం వారంతా దారుణంగా దెబ్బతిన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా కొందరు నాయకులు ఇటు వలసలు వచ్చారు. వారందరికీ ఎదురుదెబ్బ తప్పలేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అందుకు భిన్నం ఎంతమాత్రమూ కాదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలో ఉండి కూడా… అయిదేళ్లు పాలనను వెలగబెట్టిన తర్వాత.. ప్రజలు ఇంత దారుణంగా తిరస్కరిస్తారని వారెవ్వరూ ఊహించలేదు. మొత్తంలో ఏడోవంతు సీట్లు కూడా రాకపోవడం వారికి మింగుడు పడడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ పార్టీల్లోని పలువురు నాయకులు.. ఫ్యాను గాలికోసం తహతహలాడుతున్న వాతావరణం కనిపిస్తోంది.
జనసేన పార్టీ పని అయిపోయినట్లే అని అంతా ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరో అయిదేళ్ల తర్వాత ఎలా ఉండబోతుందనే విషయంలో చాలామందికి లెక్కకు మిక్కిలిగా భయాలున్నాయి. అలాంటి వారంతా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల్లో గెలిచిన, ఓడిన నాయకులతో పాటు, నియోజకవర్గస్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అనేక మంది… వైకాపాతో టచ్ లోకి వస్తుండడం విశేషం.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాబలాల పరంగా చాలా సమృద్ధిగా ఉంది. వారికి రాష్ట్రంలో ఏ మూల కూడా నాయకత్వ లేమిలేదు. పార్టీ అవసరాలకోసం ఎవ్వరినీ చేర్చుకోవాల్సిన అగత్యంలో లేరు. కాకపోతే.. వ్యక్తులే వారి అవసరాలకోసం ఆ పార్టీ వైపు ఎగబడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాతావరణంలో.. రాబోయే రోజుల్లో రాజకీయ పునరేకీకరణలు ఎన్ని మలుపులుగా చోటు చేసుకుంటాయో వేచిచూడాలి.