తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తనను తాను అనన్యసామాన్యమైన రాజకీయ వ్యూహకర్తగా భావించుకుంటూ ఉంటారు. దేశంలోనే తనను మించిన రాజకీయ తెలివితేటలు ఉన్న నాయకుడు మరొకరు లేరని కూడా ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. అయితే అదంతా కేవలం భ్రమల ప్రచారమే తప్ప… వాస్తవం కాదని ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఉదాహరణల్లో కేసీఆర్ విషయంలో బాబు అంచనా కూడా ఒకటిగా తేలుతోంది!
కేసీఆర్ ను బూచిగా, విలన్ గా చూపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల వద్ద తాను హీరో అయిపోతానని చంద్రబాబునాయుడు కలలుగన్నారు. అయితే అలాంటి విషప్రచారం ఫలితం ఇవ్వలేదు. పైగా, ఆంధ్ర ప్రజల్లో కూడా కేసీఆర్ పట్ల దురభిప్రాయం ఎంతమాత్రమూ లేదని, ఆయనను వాస్తవాల ఆధారంగా ప్రాక్టికల్ గా మాత్రమే చూస్తున్నారని… ఆయన సానుకూలంగా ఉన్నప్పుడు నీరాజనాలు పడుతున్నారని కూడా… జగన్మోహన రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా మరోమారు రుజువైంది.
కేసీఆర్ విషయంలో చంద్రబాబు పొరబడడం ఇది తొలిసారి కాదు. పాత చరిత్రలను వదిలేస్తే… తాజాగా ఆయన పలుమార్లు పొరబాటు పడ్డారు. కేసీఆర్ తన తీర్థయాత్రల్లో భాగంగా.. విశాఖకు వచ్చినప్పుడు ఆయనకు లభించిన ఆదరణ చూసి చంద్రబాబు కాస్త అలర్ట్ అయి ఉండాల్సింది. అలా జరగలేదు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ స్నేహహస్తం కోసం ప్రయత్నించి భంగపడిన తర్వాత.. చంద్రబాబు ఆయన మీద నిందలు ప్రారంభించారు.
కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేయాలని అనుకుంటున్నాడంటూ… తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రచారం చేశారు. నిజానికి ఆంధ్రా మూలాలు ఉన్న తెలంగాణలోని ప్రజలు కూడా దాన్ని పట్టించుకోలేదు. తెదేపా స్ట్రాంగ్ అనుకునే స్థానాలను కూడా బాబు కోల్పోయారు. కేసీఆర్ ను తిడితే తాను లాభపడగలననే భావననుంచి బాబు బయటకు వచ్చి ఉంటే బాగుండేది. కానీ, అలా ఒప్పుకోడానికి ఆయనకు అహం అడ్డువచ్చింది. తిరిగి ఏపీ ఎన్నికల్లో అదే మంత్రం పఠించారు. ఈసారి కేసీఆర్ తో జగన్ కు ముడిపెట్టే ప్రయత్నం చేశారు.
ఇలాంటి విషప్రచారాన్ని జనం తమ ఓట్లతో ఛీకొట్టారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన కేసీఆర్ పట్ల చాలా సాదరంగా స్పందించారు. కేసీఆర్ కూడా తన ప్రసంగంలో కృష్ణా జలాల విషయంలో ఉన్న తగాదాలను మాయచేసే ప్రయత్నం చేయకుండా, గోదావరి జలాల విషయంలో అవసరాలను, కర్తవ్యాన్ని దాచిపెట్టకుండా మాట్లాడి ప్రజల మనసులు గెలుచుకున్నారు. చంద్రబాబుకు ప్రజల ఛీత్కారం ఎదురవడానికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు గానీ… అందులో కేసీఆర్ పట్ల ప్రజల అభిప్రాయాల్ని అంచనా వేయలేకపోయిన అసమర్థత కూడా ఒకటి అని పలువురు భావిస్తున్నారు.
ఉత్తరాంధ్రలో వైసీపీని అక్కున చేర్చుకోవడానికి కారణమేంటి?