చాలామందిలో ఇలాంటి ఓ భ్రమ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ సమర్పిస్తే కచ్చితంగా అది మంచి సినిమా అయి ఉంటుంది… ఆడేస్తుంది… హిట్ అయిపోతుంది… అనుకుంటారంతా. కానీ అలాంటి భ్రమలు అస్సలు పెట్టుకోనవసరం లేదు. సురేష్ బాబు తన వ్యాపార అవసరాల కోసం చిన్న సినిమాల్ని అలా తీసుకుంటారంతే.
నిజానికి ఈ విషయంలో ఎవరూ సురేష్ బాబును సంప్రదించరు. సురేష్ బాబే తన మనషుల్ని పరిశ్రమలోకి వదుల్తారు. ఎక్కడెక్కడ చిన్న సినిమాలున్నాయో చూసి వాళ్లు కలుస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రిలీజ్ చేద్దాం అని ఒప్పిస్తారు. ఒకసారి ఒప్పుకోకపోతే మినిమం గ్యాప్స్ లో వాళ్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. బలవంతంగా ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తారు.
ఇదంతా సినిమా ఏదో అద్భుతంగా ఉందని సురేష్ బాబు కోటరీ చేసే ప్రయత్నం కాదు. వాళ్ల బిజినెస్ వాళ్లది. సురేష్ బాబు రెగ్యులర్ గా సినిమాలు నిర్మించలేరు. అలా తీసే సినిమాలతోనే ఆయన థియేటర్లు రన్ అవ్వాలంటే కష్టం. తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థకు బోలెడన్ని థియేటర్లు ఉన్నాయి. అవి నడవాలంటే సినిమాలు కావాలి. అలా అని బయ్యర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని రిలీజ్ చేయడం సురేష్ కు ఇష్టంలేదు.
సినిమాను తనే రిలీజ్ చేస్తే, తన థియేటర్లు నడిచినట్టు ఉంటుంది, చిన్న సినిమాను ఆదుకున్నామనే కలరింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. వచ్చిన దాంట్లో ఎంతో కొంత సదరు నిర్మాతకు ఇచ్చి పంపించేయొచ్చు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. అదీ సంగతి. అంతేతప్ప, సినిమాలో కంటెంట్ నచ్చి సురేష్ బాబు సినిమాలు కొనరు. ఆయన వ్యాపారం ఆయనది.
భవిష్యత్తులో కూడా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నుంచి ఎన్నో చిన్న సినిమాలు వస్తుంటాయి. భ్రమపడితే అది 'సురేష్' తప్పు కాదు.