తాను అధికారంలో ఉన్నన్ని రోజులూ… వైఎస్ జగన్, హైదరాబాదులో ఉండి రాజకీయం నడుపుతున్నారంటూ నానా రకాలుగా ఆడిపోసుకున్న చంద్రబాబునాయుడు… కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలినాడే.. హైదరాబాదులోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు! అటునుంచి అటే.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొడుకు కుటుంబాన్ని కూడా వెంటబెట్టుకుని.. విహారయాత్రలకు విదేశాలకు వెళ్లనున్నారు. ఈ పోకడలన్నీ గమనిస్తోంటే… చంద్రబాబునాయుడు రాజకీయాలను ఇక ఆటవిడుపుగా మాత్రమే చేయనున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది.
చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపారు. మొత్తం నలభయ్యేళ్లు కూడా ఎంతో క్రియాశీలమైన, ఒత్తిడితో కూడిన రాజకీయ జీవితాన్ని మాత్రమే ఆయన గడిపారు. అందులో 14 ఏళ్లపాటూ ముఖ్యమంత్రిగానే పనిచేశారు. ఎన్నో ఒత్తిడులను అనుభవించారు. తన ఏకైక కుమారుడిని రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దడానికి నానాపాట్లు పడ్డారు. తన కొడుకును మించిన రాజకీయ మేధావి మరొకరు లేరనే… ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా నాటడానికి ఆయన చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఎన్నికల్లో విజ్ఞులైన ప్రజలు తిరస్కరించారు.
చంద్రబాబునాయుడు నాయకత్వం పట్ల కూడా ప్రజల తిరస్కారం ఎంత ప్రబలంగా ఉన్నదో… 2019 ఎన్నికలు తేల్చి చెప్పాయి. ఇక తాను అమరావతిలో ఉండి చేయడానికి ఏమీలేదని చంద్రబాబుకు క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే… మాజీ సీఎం అయిపోయిన వెంటనే.. ఆయన తన స్వస్థలం హైదరాబాదుకు వెళ్లిపోయారు. విభజన తర్వాత.. కోటి ఆశలతో ప్రజలు తనకు అధికారం అప్పగిస్తే.. వారి ఆశలన్నింటినీ నీరుగార్చిన ఘనతను మూటగట్టుకున్న చంద్రబాబునాయుడు… ఈ ఎన్నికల్లో పార్టీని కేవలం 23 సీట్లకు పరిమితం చేసిన విఫలనాయకుడు చంద్రబాబునాయుడు- తన శక్తి సామర్థ్యాలు తెలుగు ప్రజల్లో తనకు మిగిలిన ఆదరణ గురించి స్పష్టత తెచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ స్థాయిలో తిరస్కరించగా.. అటు తెలంగాణలో కూడా.. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం ఎంత నీచమైన స్థితికి పతనం అయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక రాజకీయం అనేది అప్పుడప్పుడూ ఆటవిడుపుగా చేస్తే చాలునని… ఫుల్ సీరియస్ టోన్ లో చేయడం వలన సాధించేది ఏమీలేదని ఆయన ఫిక్సయినట్లుగా కనిపిస్తోంది. అందుకే జగన్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ… పరిస్థితులనుంచి పారిపోతూ.. ఆయన ముందు హైదరాబాదుకు… అటునుంచి విదేశాలకు ఓ పదిరోజులకు పైగా మొహం చాటేస్తూ పారిపోతున్నట్లుగా కనిపిస్తోంది.