మినిమం గ్యాప్ లో తన కూతుళ్లు ఇద్దర్నీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు హీరో రాజశేఖర్. శివానీ ఎంట్రీని ఆర్భాటంగా ప్రకటించిన రాజశేఖర్, శివాత్మిక ఎంట్రీని మాత్రం తెరవెనక్కే పరిమితం చేశాడు. అలా రెండు సినిమాలు మినిమం గ్యాప్ లో సెట్స్ పైకి వచ్చాయి. కానీ కట్ చేస్తే, గ్రాండ్ గా ప్రకటించిన అక్క సినిమా కంటే సాదాసీదాగా ఓపెనింగ్ జరుపుకున్న చెల్లెలు సినిమానే ముందు రాబోతోంది.
భారీగా పరిచయ కార్యక్రమం ఏర్పాటుచేసి శివానీ హీరోయిన్ గా సెట్స్ పైకి వెళ్లిన 2 స్టేట్స్ సినిమా ఆగిపోయింది. కథలో మార్పులు చేయమని నిర్మాత కోరడం, దర్శకుడు నిరాకరించడం జరిగాయి. దీంతో దర్శకుడ్ని పక్కనపెట్టే ఆలోచనలో యూనిట్ ఉంది. అయితే సదరు దర్శకుడు ఏకంగా దీనిపై కోర్టుకు వెళ్లాడు. అలా 30శాతం షూటింగ్ పెండింగ్ లో పడింది.
2 స్టేట్స్ సినిమా కోర్టు చిక్కులతో అలా ఆగిపోగా, మరోవైపు శివాత్మిక నటించిన దొరసాని సినిమా చకచకా సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. 6వ తేదీన టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజున విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.
సో.. శివానీ కంటే శివాత్మిక ముందుగా వెండితెరపైకి వస్తోందన్నమాట. ఈ విషయంలో రాజశేఖర్-జీవిత ఒకటి భావిస్తే, మరొకటి జరుగుతోంది. ఈ టైమ్ లో వాళ్లు కూడా ఏం చేయలేరు. అలా చూస్తూ ఉండడం తప్ప.