థమన్ ను సేమ్ టు సేమ్ థమన్ అని అనడం ఇవ్వాళ నిన్నటి సంగతికాదు. ఎప్పటి నుంచో వినిపిస్తోన్న సంగతి. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో అరవింద సమేత వీరరాఘవ లాంటి ఎగ్జయిటింగ్ అండ్ ఎక్స్ క్లూజివ్ ప్రాజెక్ట్ లో కూడా తన పాత ట్యూన్ లే అటు ఇటు మార్చి వాడేసరికి, జనం ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. అదిమహా ఇరిటేటింగ్ గా అనిపించినట్లుంది థమన్ కు. అందుకే మనసులో మాటలు బయటకు కక్కేసారు.
'నా ట్యూన్ లు నేనే వాడుకుంటే తప్పేంటీ? నా పేపర్ లో ఆన్సర్ లు చూసి నేనే రాసుకుంటే తప్పేంటీ? అది నా స్టయిల్. ప్రతి మ్యూజిక్ డైరక్టర్ కు ఓ స్టయిల్ వుంటుంది. నాకూ అలాగే ఒక స్టయిల్ వుంది. అది మీకు కాపీ అనిపిస్తే, అలా అనుకుని కామెంట్ చేయడం మీకు ఆనందం ఇస్తే, మీ ఇష్టం.. నేనేం పట్టించుకోను' అనే విధంగా మాట్లాడుతున్నాడు.
ఇదంతా చిత్రమైన వాదన అని థమన్ కు కూడా లోలోపల అనిపిస్తూ వుండొచ్చు. కానీ బయటకు అలా మాట్లాడకపోతే ఎలా? అందుకే కావచ్చు. ఈ వితండ వాదం. కానీ థమన్ ఒకటి గమనించాలి. క్రియేటర్ అనేవాళ్లు సరైన చాన్స్ కోసం చూస్తుంటారు. అలాంటి చాన్స్ వస్తే, అద్భుతాలు సృష్టించాలనుకుంటారు.
త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా పడడం అంటే ఎలాంటి చాన్స్. అలాంటపుడు తను అద్భుతాలు చేసి చూపించాలి కానీ, ఇది నా స్టయిల్ అని పాత పాటలు తిప్పికొట్టి చేతిలో పెట్టడం కాదు. అ..ఆ సినిమాకు విక్కీ జె మేయర్ కు ఆ చాన్స్ వచ్చింది. ఆయన పాత ట్యూన్ లు ఇచ్చారా?
ఓ సృజనకారుడికి అద్భుతమైన అవకాశం వస్తే, అభిమానులు కావచ్చు, సాదా జనాలు కావచ్చు ఆశించేది ఒకటే, సమ్ థింగ్ అద్భుతం. అది రానపుడు సహజంగా విమర్శలు వస్తాయి. వాటిని సవాల్ గా తీసుకుని, ముందుకు వెళ్లాలి కానీ, కామెంట్ చేసిన వాళ్లను కామెంట్ చేయడంకాదు. థమన్ కు ఇంకా కుర్రతనం పోయినట్లు లేదు.