టాక్సీవాలా. యువి క్రియేషన్స్ నిర్మించిన విజయ్ దేవరకొండ సినిమా. ఈ సినిమాను బ్యాడ్ లక్ వెన్నాడుతోంది. ఎప్పడో విడుదల కావాల్సింది. సిజి వర్క్ బాగా రాక, కాంట్రాక్టు మార్చి, మళ్లీ చేయించారు. విడుదల చేద్దాం అనుకుంటే గీత గోవిందం వచ్చింది. సరే దాని తరువాత చేద్దాం అనుకుంటే, నోటా ముందు విడుదల చేద్దాం అని విజయ్ రిక్వెస్ట్. సరే అని పక్కన పెడితే, పైరసీ సమస్య.
గీత గోవిందం టైమ్ లో లీకైన సినిమాలో టాక్సీవాలా కూడా వుంది. ఈ సినిమా టోటల్ గా బయటకు వెళ్లిపోయిందని టాక్. నాలుగు గంటల రా ఫుటేజ్ బయటకు వెళ్లిపొయిందట. అయితే లక్కీ గా అది రా ఫుటేజ్ కావడం, డైలాగులు, రీ రికార్డింగ్, సిజి ల్లాంటివి ఏవీ లేకపోవడం అన్నది కలిసి వచ్చింది.
ఈస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లిలో లీకు మూలాలు బయటకపడడమో మరేదో జరిగినట్లు, ఈ సందర్భంగా కొంతమందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు దేవరపల్లిలో టాక్సీవాలా నిర్మాతలు, పోలీసులు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ హోల్డ్ చేసి, మొత్తం వివరాలు చెబుతారట.
ఇదిలా వుంటే టాక్సీవాలా రా ఫుటేజ్ కేవలం ఈస్ట్ గోదావరిలోనే కాదు, వెస్ట్, గుంటూరు, తెలంగాణ ప్రాంతాల్లో కూడా చక్కర్లు కొడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. యువి అంటే అదృష్టం అంటారు. అలాంటిది ఆ సంస్థ నిర్మించిన టాక్సీవాలాకు మాత్రం ఎందుకో ఈ కష్టాలు?