ఆడు మగాడ్రా బుజ్జీ అన్నది త్రివిక్రమ్ డైలాగ్ నే. ఇప్పుడు తివిక్రమ్ స్వయంగా కదలి వెళ్లినా, నిజానికి అలా వెళ్లడం అన్నది త్రివిక్రమ్ మెంటాలిటీకి విరుద్ధమే అయినా, పని మాత్రం జరగలేదు. పవన్ కళ్యాణ్ కదలి వెళ్లకపోయినా, త్రివిక్రమ్ మర్యాదపూర్వకంగా కలవకపోయినా, ఆంధ్రలో థియేటర్లకు గేట్లు తీసేసింది అక్కడి ప్రభుత్వం. శాంతిభద్రతల గురించి ఆలోచించకుండానే 24గంటలూ థియేటర్లు రన్ చేసుకోండి అని జివో ఇచ్చేసింది. కానీ తెలంగాణలో ఒక్క అర్థరాత్రి ఆటకు నో పర్మిషన్ అనేసారు.
పవన్ కళ్యాణ్ అంటే కేసిఆర్ కు ఏమాత్రం స్నేహం వుందన్నదాని మీద ఆది నుంచీ అనుమానాలు వున్నాయి. అప్పటికీ పవన్ కళ్యాణ్ నే ఓ మెట్టు దిగివచ్చి మరీ తరచు ప్రయత్నిస్తున్నారు. కానీ స్నేహం కుదురుతున్న జాడలు కనిపించడం లేదు. కేసిఆర్ తో స్నేహం కుదిరితే ఆంధ్రలో మాదిరిగా అనథికార ప్రతిపక్ష హోదా చెలాయించేయవచ్చు. కానీ ఆ పప్పులు ఇక్కడ ఉడుకుతున్నట్లు లేదు.
అజ్ఞాతవాసికి ప్రత్యేక షోల కోసం ముందుగానే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నేరుగా కేటిఆర్ ను సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి, నాన్న కేసిఆర్ నే అడగమని చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి నేరుగా కలిసారు. గంటా పదినిమషాలు వెయింటిగ్ లో పెట్టి కేసిఆర్ కలిసారు. మాట్లాడారు. పవన్ బయటకు వచ్చి, ఏదోదో చెప్పి వెళ్లారు.
ఆ తరువాత త్రివిక్రమ్, చినబాబు వెళ్లి సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిని కలిసారు. పవన్ మాత్రం తలసానిని కలవలేదు. గతంలో పవన్ నేరుగా తలసానిపై విమర్శలు చేసిన ఉదంతాలు వున్నాయి. అందుకా లేదా, తన లెవెల్ కు కేసిఆర్ ను తప్ప వేరెవర్నీ కలవకూడదు అనుకున్నారో, తెలియదు.
కూకట్ పల్లి ప్రాంతంలో దాదాపు అయిదు బెనిఫిట్ షో లకు ఏర్పాట్లు చేసుకున్నారు. టికెట్ లు ప్రింట్ చేసుకున్నారు. ఏ మేరకు అమ్మారు అన్నది తెలియదు. కానీ ఇప్పుడు కింకర్తవ్యమ్? అందుకే సెకెండ్ షో టైమ్ లో వేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు నిర్మాత ఓకె అనాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
జనాలకూ ఇబ్బందే
ఇలా స్పెషల్ షోలు అర్థరాత్రి వేయడం వల్ల జనాలు కూడా కాస్త ఇబ్బందిపడుతున్నారు. కామ్ గా సినిమా వేయడం వేరు. సినిమా టైమ్ కు గంట ముందు నుంచి ఆ ప్రాంతం అంతా బైక్ ల హోరు, బాణాసంచా, కేకలు, ఈలలు, గోలలు. దీంతో ఆ చుట్టుపక్కల అంతా డిస్ట్రబ్ అవుతోంది. ఈ విషయమై పోలీసులకు చాలా మంది గతంలో ఫిర్యాదు చేసారని వార్తలు వినవచ్చాయి. బహుశా అవి కూడా ప్రత్యేక షో ల అనుమతి నిరాకరణకు ఓ కారణం కావచ్చు.