మహాలక్ష్మి వచ్చేసింది.. మరి దర్శకుడు ఎక్కడ?

క్వీన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది దటీజ్ మహాలక్ష్మి. హిందీలో కంగనా రనౌత్ చేసిన క్యారెక్టర్ ను తెలుగులో తమన్న పోషించింది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ తో…

క్వీన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది దటీజ్ మహాలక్ష్మి. హిందీలో కంగనా రనౌత్ చేసిన క్యారెక్టర్ ను తెలుగులో తమన్న పోషించింది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ తో పాటు తమన్న లుక్ బయటకొచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం పోస్టర్ లో వేయలేదు. 

మను కుమరన్ ప్రొడక్షన్ అంటూ ఐఫిల్ టవర్ బ్యాక్ డ్రాప్ తో సినిమా పోస్టర్ ను బాగానే డిజైన్ చేశారు. కో-ప్రొడ్యూసర్లు, అసోసియేట్ ప్రొడ్యూసర్లు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరక్టర్ ఇలా అన్ని పేర్లు వేసుకున్నారు. చివరికి పబ్లిసిటీ డిజైనర్ పేరు కూడా వేశారు. కానీ దర్శకుడి పేరు మాత్రం ప్రచురించలేదు.

మహాలక్ష్మి యూనిట్ ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమాకు అసలు దర్శకుడు నీలకంఠ. మూవీ ఓపెనింగ్ రోజు ఉన్నది ఆయనే. అంతేకాదు, ప్రారంభోత్సవం రోజునే ఈ సినిమాకు క్వీన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడాయన. 

కానీ షూటింగ్ టైమ్ లో తమన్నకు, నీలకంఠకు పెద్ద గొడవ జరిగింది. యూనిట్ లో ఎవరో ఒకరే ఉండాలి అనేంత వరకు వెళ్లింది పరిస్థితి. దీంతో నిర్మాత తమన్న వైపే మొగ్గుచూపాడు. ఫలితంగా నీలకంఠ యూనిట్ నుంచి బయటకెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడి స్థానంలో 'అ!' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ వచ్చాడు. మిగతా పని పూర్తిచేశాడు. పనిలోపనిగా టైటిల్ కూడా మార్చేశారు.

సరిగ్గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైమ్ కు దర్శకుడిగా ఎవరి పేరు వేయాలనే దగ్గర సమస్య తలెత్తింది. నీలకంఠ పేరు తప్పించి ప్రశాంత్ వర్మ పేరు మాత్రమే వేస్తే అదో పెద్ద వివాదం అయి కూర్చుంటుంది. పోనీ ఇద్దరి పేర్లు వేద్దామంటే తమన్న ఒప్పుకోదు. అందుకే దర్శకుడి పేరు లేకుండానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ వరకు బాగానే మేనేజ్ చేశారు కానీ రిలీజ్ టైమ్ లో తెరమీద ఎవరి పేరు వేస్తారో చూడాలి. సెటిల్ మెంట్ చేయకుండా నీలకంఠ పేరు తీసేస్తే కచ్చితంగా పెద్ద గొడవైపోతుంది.