ఇప్పటికే టాప్ హీరోల సినిమాల థియేటర్ రైట్స్ కొండెక్కి కూర్చున్నాయి. 90 కోట్లకు పైగా ఆంధ్ర తెలంగాణలో విక్రయిస్తున్నారు. దీంతో ప్రతి సినిమాకు బయ్యర్లు కుదేలయిపోతున్నారు. కానీ అలా అని చెప్పడానికి లేదు. హీరో కోసం అసలు లెక్కలు దాచిపెట్టి, నవ్వు మొహాలతో లాభాలు వచ్చాయని, బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పుకోవాల్సి వస్తుంది. తెరవెనుక బయ్యర్లు నిర్మాతతో కిందామీదా పడాలి.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే పాతిక కోట్లకు చేరిన టాప్ హీరోల రెమ్యూనిరేషన్ మరింత పెరగాలంటే ఎలా? అదర్ దాన్ థియేటర్ హక్కుల రేట్లు సాధించాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు తరపున ఆయన వ్యవహారాలు చక్కబెట్టే నమ్రత ఆలోచన అదే.
మహర్షి సినిమాకు నాన్ థియేటర్ ఆదాయం కనీసం 50 కోట్లు రావాలని, అందుకు తానే అన్నివిధాలా డీల్ చేస్తానని నమ్రత ఇప్పటికే నిర్మాత దిల్ రాజుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే మా టీవీకి ఆల్ మోస్ట్ ఫైనల్ అయిన, గతంలో మహేష్ స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమాలు కొని నష్టపోయిన జీ టీవీని కాదని, జెమిని టీవీకి మహర్షి హక్కులు దఖలు పడ్డాయి.
ఈ డీల్ మొత్తాన్ని నమ్రతనే స్వయంగా డీల్ చేసినట్లు తెలుస్తోంది. అటు నిర్మాతలు పివిపి కానీ, అశ్వనీదత్ కానీ పూర్తిగా మబ్బులొనే వున్నారు. ఇప్పటికీ ఎంతకు డీల్ కుదిరిందన్న సంగతి వారికి తెలియదు. ఇప్పటి వరకు డీల్ మీద వారు సంతకాలు కూడా చేయలేదు. కేవలం నమ్రత, దిల్ రాజు మాత్రమే ఈ వ్యవహారంలో పూర్తి సమాచారం తెలిసి వున్నారు.
విశ్వసీనయ సమాచారం ప్రకారం కేవలం జెమినికి శాటిలైట్ హక్కులు 14 కోట్లకు ఇవ్వాడానికి ఓరల్ గా అంగీకారం కుదిరింది. ఇంకా డీల్ ఫైనల్ కావాలంటే నిర్మాతలు సంతకాలు చేయాల్సి వుంది. ప్రస్తుతానికి రేటు ఫైనల్ చేసి, జెమిని టీవీ డీల్ ను అలా హోల్డ్ లో వుంచినట్లు తెలుస్తోంది.
ఇక ఇదికాక అమెజాన్ కు డిజిటల్ రైట్స్ అమ్మాలి. అది పది నుంచి 12 కోట్లు వస్తాయని ఆశిస్తున్నారు. హిందీ డబ్బింగ్, అదర్ రైట్స్ అమ్మకంగా ఇంకా పెండింగ్ లో వుంది. వంశీ పైడిపల్లి కాకుండా మరెవరైనా మాస్ డైరక్టర్ అయి వుంటే హిందీ రైట్స్ ఎప్పుడో అయిపోయేవి.
కానీ వంశీ పైడిపల్లి క్లాస్ దర్శకుడు కావడంవల్ల సరైన రేటు కోట్ రావడంలేదని తెలుస్తోంది. బ్రాండింగ్ వగైరా అన్నీ కలిపినా 40 నుంచి 45 కోట్ల మధ్యనే వస్తుందని 50 రావడం కష్టమని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
కానీ తాను డీల్ చేస్తానని, మాగ్జిమమ్ రాబడదామని నమ్రత రంగంలోకి దిగారని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. దీనివల్ల ఈ సినిమా ఆదాయంలో మహేష్ కు వచ్చే లాభం ఏమీవుండదు. కానీ థియేటర్ రైట్స్ 100 కోట్లు, నాన్ థియేటర్ 50 కోట్లు ఆదాయం చూపిస్తే, వచ్చే సినిమాకు అంతకు అంతా మహేష్ ఆదాయం పెంచుకోవచ్చు. అదీ స్ట్రాటజీ అని తెలుస్తోంది.