కరోనా టైమ్ లో ఎవడి బాధ వాడిది. ఎవరి వ్యాపారాలు వారివి. ఎవరి కష్టాలు వారివి. సినిమా జనాలకు రెండు సమస్యలు. ఒకటి షూటింగ్ లు. రెండు రిలీజ్ లు. విత్తుముందా? చెట్టుముందా? లాంటి సమస్య ఇప్పుడు? షూటింగ్ లకు ముందు అనుమతి రావాలా? రిలీజ్ లకు అనుమతి ముందుగా ఇవ్వమనాలా? షూటింగ్ లు లేకుండా సినిమాలు లేవు. రిలీజ్ లు లేకుండా సినిమాలు అనవసరం అన్న బోలెడు డిస్కషన్లు.
ప్రభుత్వం దృష్టిలో సినిమా షూటింగ్ లు, థియేటర్ల ఓపెన్ అన్నది లాస్ట్ ప్రయారిటీ. అందులో అణుమాత్రం సందేహం లేదు. ఇలాంటి నేపథ్యంలో జూన్ తరవాతే షూటింగ్ లు అయినా, విడుదలలు అయినా అనే మాట వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో థియేటర్లు చేతిలో వుంచుకున్న సినిమా పెద్దలు ముందుగా షూటింగ్ లే ప్రారంభించేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
దీని వెనుక పెద్ద స్ట్రాటజీనే వుంది.
థియేటర్లు ఓపెన్ చేస్తే జనం వస్తారో? రారో అన్నది ఇంకా క్లారిటీ లేదు. అలా అని విడుదలకు సిద్దంగా ఎన్నో సినిమాలు కూడా లేవు. వన్స్ థియేటర్లు ఓపెన్ చేస్తే, ఏదో ఒక సినిమా వేసుకోవాలి. సరిపడా ఆదాయం రాదు. కానీ థియేటర్ స్టాఫ్ కు జీతాలు ఇవ్వాలి. థియేటర్ లీజులు కట్టాలి. థియేటర్ కరెంట్ బిల్లు ఫుల్ గా కట్టాలి.
అదే కనుక కరోనా కారణంగా మూసి పెడితే జీతాలు ఇవ్వక్కరలేదు. నామినల్ కరెంట్ బిల్లు కడితే సరిపోతుంది. లీజు మొత్తాలు కూడా ఏదో విధంగా తప్పించుకోవచ్చు. ఇన్ని సదుపాయాలు వుంటాయి. వన్స్ సినిమాలు ఫుల్ గా రెడీ అయ్యాక థియేటర్లు తీస్తే, అప్పుడు ఏ సమస్య వుండదు.
ఇండస్ట్రీ పెద్దలంతా ఎగ్జిబిటర్లే. సురేష్ బాబు, అరవింద్, దిల్ రాజు, సునీల్, యువి ఇలా నిర్మాతలు అంతా ఎగ్జిబిటర్లే. వీరందరివీ సినిమాలు నిర్మాణంలోనూ వున్నాయి. అందుకే షూటింగ్ లు ప్రారంభిస్తే బెటర్ అని వీరంతా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
పైగా థియేటర్లు తెరుచుకుంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం, కర్ణాటక అన్ని చోట్లా తెరుచుకువాలి. ఒక చోట తెరుచుకుని, మరో చోటా తెరవకుంటే విడుదలలు సాధ్యం కాదు. పైగా ఇప్పుడు కరోనా నేపథ్యంలో థియేటర్లు, శానిటేషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం అంత వీజీ కాదు. తేడా వస్తే థియేటర్లు సీజ్ అంటారు. అందుకే థియేటర్లు తెరిచే విషయంలో ఎటువంటి తొందర పనికి రాదని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నట్లు బోగట్టా.
అదే షూటింగ్ లు మొదలయితే ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు ఇలా అందరికి చేతినిండా పని వుంటుంది. అందరికీ ఉపాథి దొరుకుంతుంది. థియేటర్లు అయితే సినిమా జనాలకు లాభం వుండదు. థియేటర్ స్టాప్ కు మాత్రమే లాభం. పైగా సినిమాలు రెడీ చేసుకుంటే దసరా, సంక్రాంతి సీజన్లను మీట్ కావచ్చు.
అయితే రెండు తెలుగు ప్రభుత్వాలు సినిమా రంగం మీద అస్సలు దృష్టి పెట్టలేదు. వాటి సమస్యల్లో అవి వున్నాయి. అందువల్ల జస్ట్ ప్రభుత్వాల దృష్టికి ఎలా పంపాలో అలా సమాచారం చేరవేస్తున్నారు తప్ప, ఇంకా ఏదీ క్లారిటీ లేదు. మే 3 తరువాత క్లారిటీ రాచవ్చు.