సింగపూర్ జ్యోతిష్యం నిజమవుతుందా?

సింగపూర్ జ్యోతిష్యం ఏమిటి ? ఇది కొత్తగా వచ్చిందా ? సింగపూర్ లో జ్యోతిష్యులు ఉన్నారా ? వాస్తులో చైనా వాస్తును నమ్మేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ వాస్తు పేరు ఫెంగ్షుయి. ఇలాంటిదే జ్యోతిష్యంలో…

సింగపూర్ జ్యోతిష్యం ఏమిటి ? ఇది కొత్తగా వచ్చిందా ? సింగపూర్ లో జ్యోతిష్యులు ఉన్నారా ? వాస్తులో చైనా వాస్తును నమ్మేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ వాస్తు పేరు ఫెంగ్షుయి. ఇలాంటిదే జ్యోతిష్యంలో కూడా సింగపూర్ నుంచి ఏమైనా దిగుమతి అయిందని అనుకుంటున్నారా ? ఒక విధంగా చెప్పాలంటే సింగపూర్ వాళ్ళు జ్యోతిష్యం చెప్పారు. సింగపూర్ వాళ్లంటే అక్కడి ఒక యూనివర్సిటీ వాళ్ళన్నమాట. జ్యోతిష్యం అంటే గ్రహ సంచారం గురించి లెక్కలు వేసి చెప్పడం కాదండి. శాస్త్రీయంగా కొన్ని గణాంకాలు తయారుచేసి, కొన్ని అంచనాలు వేసి చెప్పడమన్నమాట.

 ఇంతకూ ఈ జ్యోతిష్యం దేన్ని గురించి. సమస్త మానవాళిని పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి. ఈ మహమ్మారి ఏ దేశం నుంచి ఎప్పుడు వెళ్లిపోతుందో అంచనా వేసి సింగపూర్ లోని టెక్నాలజీ అండ్ డిజైన్ అనే యూనివర్సిటీ తెలియచేసింది. భారత్ సహా ఇంకొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఎప్పుడు ఆయా దేశాలను విడిచిపెట్టి వెళ్లి పోతుందో చెప్పింది. చెప్పడమంటే ఆషామాషీగా ఉజ్జాయింపుగా చెప్పడం కాదు ఏ నెలలో ఏ తేదీ నాడు గడప దాటుతుందో కూడా అంచనా వేసింది.

ఇలా అంచనా వేయాలంటే ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలికదా. ఫలానా గ్రహం ఫలానా చోట ఉన్నట్టయితే ఇలా జరుగుతుందని చెప్పడం కాదు కదా. ఆయా దేశాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వైద్య సౌకర్యాలు, నమోదవుతున్న కేసులు, డిశ్చార్జ్ అవుతున్న కేసులు, లాక్ డౌన్ అమలవుతున్న తీరు… ఇలాంటివన్నీ అధ్యయనం చేసి ఒక అంచనాకు వచ్చి ఫలానా తేదీలోగా కరోనా మాయమైపోతుందని సింగపూర్ యూనివర్సిటీ అంచనా వేసింది. 

దానిప్రకారం … ఇండియాలో మే 21 నాటికి కరోనా పూర్తిగా (97 శాతం ) తొలగిపోతుందని చెప్పింది. అదే సమయానికి చాలా దేశాల్లో అటూ ఇటుగా కరోనా అంతమవుతుంది. సింగపూర్ యూనివర్సిటీ కరోనా వ్యాప్తిపై కేంద్రప్రభుత్వం రోజువారీగా విడుదల చేస్తున్న డేటాను నిశితంగా స్టడీ చేస్తోంది. ఇండియాలో మే 16 వరకు లాక్ డౌన్ పొడిగిస్తే కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉండదని యూనివర్సిటీ తెలియచేసింది. మే 21 నాటికి పూర్తిగా పోతుందని చెప్పింది. 

ప్రపంచవ్యాప్తంగా మే 29 నాటికి కరోనా పరారై పోతుంది. ఇక వివిధ దేశాల విషయానికొస్తే ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలు నమోదైన అమెరికాలో మే 11 నాటికి కరోనా అదృశ్యమవుతుంది. అలాగే స్పెయిన్లో మే 9  , ఇటలీలో మే 7 ఇరాన్ లో మే 10  , టర్కీలో మే 15 , ఫ్రాన్స్ లో మే 3 , జర్మనీలో ఏప్రిల్ 30 , కెనడాలో మే 16 నాటికి కరోనా వెళ్లి పోతుంది. అయితే ఇదంతా 97 శాతం మాత్రమే. మరి పూర్తిగా ఆనవాళ్లు లేకుండా ఎప్పుడు పోతుందయ్యా అంటే డిసెంబర్ 8 నాటికి మనుషులకు కనబడకుండా మూటా ముల్లె సర్దుకొని వెళ్లి పోతుందట. సింగపూర్ యూనివర్సిటీ అంచనా ఏయే దేశాల్లో ఎంతవరకు వాస్తవ రూపం ధరిస్తుందో చూడాలి.

కథ ఇంతవరకు బాగానే ఉంది. కానీ అన్ని దేశాల జాతకాలు చెప్పిన సింగపూర్ యూనివర్సిటీ తన దేశంలో మాత్రం కరోనా ఎప్పుడు మాయమవుతుందో చెప్పలేదు. సింగపూర్లో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దేశంలో ఆదివారం ఒక్క రోజే 931 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది కదా. ఈ రోజు 799 కేసులు నమోదయ్యాయి. సింగపూర్లో మొత్తం  కేసులు 14 వేలు దాటాయి. 14 మంది చనిపోయారు. మరి కరోనా మహమ్మారి ఈ దేశం నుంచి ఎప్పుడు పారిపోతుంది ? 

కరోనా బాధితులకు బంగారు గాజులు లేవా బాబూ ?

అబ్బా కొడుకులు ఎక్కడ దాక్కున్నారు ?