ఇటీవల నగరి ఎమ్మెల్యే రోజాపై పుత్తూరులోని సుందరయ్యకాలనీ వాసులు పూలుజల్లడం వివాదాస్పదమై, ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సోషల్ మీడియాలో తనపై అవాకులు చెవాకులు పేలిన తెలుగు తమ్ముళ్లపై రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సాక్షి చానల్ లైవ్‌లో మాట్లాడుతూ నాటి ఘటనను మరోసారి గుర్తు చేస్తూ ప్రతిపక్ష టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్ వేళలో పూలు బయటి మార్కెట్‌లో దొరుకుతాయనే విషయాన్నితాను ఊహించలేదని ఆమె అన్నారు. కానీ సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలను తమ ప్రభుత్వం తీర్చడంతో…అక్కడి ప్రజలు అభిమానంతో తనను ఆహ్వానించారన్నారు. అయితే స్థానికులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తనపై పూలు చల్లారన్నారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించిన దాన్ని పక్కన పెట్టి, తాను నడుచుకుంటూ వెళుతున్న వీడియోను మాత్రమే చూపుతూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయన్నారు.
టీడీపీ నేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కరోనా విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. రాజకీయాలే కావాలనుకుంటే కరోనా తర్వాత వాళ్లో, తామో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
ఏపీలో కరోనా విజృంభిస్తున్నదంటూ ప్రతిపక్ష నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారన్నారు. అలాగే వీళ్లకు ఎల్లో మీడియా తోడైందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను సమర్థిస్తున్నానన్నారు. కరోనాపై తప్పుడు లెక్కలు చెబుతున్న ప్రతిపక్ష నాయకులకు, మీడియా సంస్థల యజమానులకు కరోనా ప్రాప్తిరస్తు అని రోజా శపించారు. అబద్ధాలాడే వాళ్లకు అలాంటి శాస్తి తప్పదని ఆమె హెచ్చరించారు.